గతేడాది లక్షల మంది జీవితాలను అతలాకుతలం చేసిన కొవిడ్ మహమ్మారి మరోసారి ముంచుకొస్తోంది. సెకండ్ వేవ్‌లో రోజుకు నాలుగు లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. రాత్రి కర్ఫ్యూను కొన్ని రాష్ట్రాలు కొనసాగిస్తున్నాయి. మహరాష్ట్ర, కర్ణాటక, దిల్లీ లాంటి రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. మరోసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారని కొందరు భావిస్తున్నారు.
కరోనా నేపథ్యంలో విధిస్తున్న ఆంక్షల వల్ల ఆదాయాలపై ప్రభావం పడే ఆస్కారం ఉంది. ఒక వేళ లాక్డౌన్ విధిస్తే.. చాలా మంది ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఆర్థికంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం ఇప్పుడు పరిశీలిద్దాం.
ఖర్చు వీలైనంత తగ్గించుకోండి..
కరోనా వల్ల 2020లో చాలా మందికి ఆదాయాలు తగ్గిపోయినప్పటికీ గత కొన్ని నెలల్లో కాస్త తేరుకున్నారు. కరోనా సమసిపోయినందన్న ఉద్దేశంతో చాలా మంది ఖర్చు పెట్టటం కూడా ప్రారంభించారు. అయితే కరోనా విజృంభిస్తోన్న తరుణంలో భవిష్యత్‌పై మరోసారి సందిగ్ధత నెలకొంది.
భవిష్యత్తులో ఖర్చులు పెరగవచ్చు. అదేవిధంగా ఆదాయాలు పడిపోవచ్చు. కాబట్టి ఖర్చులు జాగ్రత్తగా చేసుకోవాలి. తప్పనిసరి అవసరం అయితేనే కొనుగోలు చేయటం ఉత్తమమని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వేతనాల కోత, ఆదాయం తగ్గుదల ఉండొచ్చని అనుకుని.. ఖర్చులు వీలైనంత కనిష్ఠానికి కుదించుకోవలంటున్నారు.
2020లో లాక్డౌన్ విధించిన సమయంలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. డబ్బులు పొదుపు చేసుకున్న వారు మాత్రం కొంత సౌకర్యంగా ఉన్న పరిస్థితి కనబడింది. అందుకే.. కనీసం ఆరు నుంచి 12 నెలల ఖర్చులకు సరిపడా.. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
బీమా తీసుకుంటే కొండంత ధీమా..
కరోనా వల్ల ఆరోగ్య ఖర్చులు పెరిగిపోయాయి. వీటి వల్ల ఆర్థిక భారం పడకుండా చూసుకోవాలి. ఆరోగ్య బీమా ఈ విషయంలో ఉత్తమంగా పనిచేస్తుంది. ఆరోగ్య బీమా లేని వారు కొత్తగా తీసుకోవాలి. ఆరోగ్య బీమా ఉన్నట్లయితే.. బీమా మొత్తం సరిపోతుందా? లేదా? చూసుకోవాలి.
కరోనా చికిత్స కోసం భారీగా డబ్బులు ఖర్చులు పెట్టాల్సి వస్తోంది. దీనికోసం ప్రత్యేకించి కరోనా రక్షక్, కరోనా కవచ్ పాలసీలు ఉన్నాయి. వీటిని తీసుకోవటాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆరోగ్య బీమా మొత్తం సరిపోని పక్షంలో లో కూడా వీటిని తీసుకోవచ్చు.
క్రెడిట్ కార్డు వాడొద్దు..
క్రెడిట్ కార్డు ఉపయోగాన్ని తగ్గించుకోవాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. డెబిట్ కార్డు మాత్రమే ఉపయోగించటానికి ప్రయత్నించాలని వారు చెబుతున్నారు. క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే బిల్లు కట్టే విషయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఒక వేళ క్రెడిట్ కార్డు ఉపయోగించినా.. దానికి సంబంధించిన పూర్తి మొత్తం చెల్లించే విధంగా ప్రణాళిక వేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
పెట్టుబడుల ఉపసంహరణ
ఖర్చులకు డబ్బులు సరిపోని పరిస్థితి వస్తే పెట్టుబడుల విక్రయం విషయంలో ఆలోచన చేసుకోండి. పరిస్థితి సరిగ్గా లేనట్లయితే బంగారం, ఈక్విటీ, ఇతర ఆస్తులను విక్రయించటంపై ముందే ఓ ఆలోచన చేసుకోవాలి. మళ్లీ పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన అనంతరం కొనుగోలు చేసేలా ప్రణాళిక వేసుకోండి. పెట్టుబడులపై రుణాలు తీసుకోవటం కంటే వాటిలో కొంత మొత్తం ఉపసంహరించుకోవటం మేలని వారు చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో దీర్ఘకాలం కోసం చేస్తున్న పొదుపును ఉపయోగించుకోవచ్చు. రుణం తీసుకోవటం కంటే ఇదే మంచి పద్ధతి అని వారు చెబుతున్నారు. కానీ సాధారణ పరిస్థితులు వచ్చిన అనంతరమే మళ్లీ పెట్టుబడిని సాధారణ స్థాయికి తీసుకెళ్లేలా ప్రణాళిక వేసుకోవాలని సూచిస్తున్నారు.
ఈక్విటీ మార్కెట్లు
ప్రస్తుతం సెకండ్ వేవ్ భారతదేశంలోనే ఎక్కువగా ఉంది. చైనా, అమెరికా లాంటి దేశాల్లో వ్యాక్సినేషన్ ఎక్కువగా కావటంతో అక్కడ ప్రభావం అంతగా లేదు. కాబట్టి దేశీయంగా ఈక్విటీ మార్కెట్లలో అస్థిరత ఇంకా కొనసాగే అవకాశం ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిని బంగారం, డెట్ ఫండ్ల లాంటి వాటిలో కూడా పెట్టి.. బ్యాలెన్స్డ్గా ఉండాలి. మహమ్మారి సమయంలో గతేడాది ఈక్విటీ పడిపోతుంటే.. బంగారం ధర పెరగటం చూశాం. బ్యాలెన్స్డ్ ఫోర్ట్ ఫోలియో ఉండటం వల్ల ఒకటి పడిపోతున్నా.. ఇంకోటి మంచి రాబడిని ఇస్తుంది. ఈ విధంగా మొత్తంగా నష్టం లేకుండా చూసుకోవచ్చు.
గతేడాది మార్కెట్లు కొంత పతనం కాగానే.. కొందరు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డబ్బులు అవసరం ఉండి కొంత మంది తీసుకున్నారు. మరికొందరు నష్టభయంతో తీసుకున్నారు. దీనివల్ల కొంత మంది నష్టాలను మూటకట్టుకున్నారు. కొందరు తక్కువ స్థాయి లాభాలను మాత్రమే సరిపెట్టుకున్నారు.
మార్కెట్లు పెరిగినప్పుడు ఆ లాభాన్ని పొందలేకపోయారు. కంగారులో ఈక్విటీ పెట్టుబడుల ఉపసంహరణ చేయకూడదని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: