గత ఎనిమిదేళ్లలో క్రెడిట్ కార్డుల సంఖ్య మూడింతలు పెరిగి 6.2 కోట్లకు చేరినట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఈ కార్డుల ద్వారా నెలవారీ లావాదేవీలూ 4.7 రెట్లు పెరిగాయి. దీంతో క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్న వారి సంఖ్య, తద్వారా ఖర్చు చేస్తున్న సొమ్ము కూడా పెరుగుతూ పోతోంది. అయితే, క్రెడిట్ కార్డు రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. తెలివిగా వినియోగిస్తేనే ప్రయోజనాలు. లేదంటే మనకు తెలియకుండానే నష్టపోతాం. మరి ఈ కార్డును ప్రయోజనకరంగా ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం.
బిల్లింగ్ సైకిల్‌కు కట్టుబడి ఉండండి
ప్రతి క్రెడిట్ కార్డుకు 50 రోజుల బిల్లింగ్ సైకిల్ ఉంటుంది. అంటే మీ బిల్లింగ్ సైకిల్‌లోని తొలిరోజు మీరు డబ్బు వాడుకుంటే.. తిరిగి చెల్లించడానికి మీకు 50 రోజుల సమయం ఉంటుంది. ఒకవేళ మీరు మీ బిల్లింగ్ సైకిల్‌లో 30వ రోజు సొమ్మును వినియోగించుకుంటే తిరిగి చెల్లించడానికి మరో 20 రోజులు ఉంటాయి. ఈ సమయంలోపు మీరు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఉదాహరణకు.. ఆగస్టు 10వ తేదీన మీ బిల్లింగ్ సైకిల్ ప్రారంభమవుతుందనుకోండి. సెప్టెంబరు 9వ తేదీ వరకు మీకు క్రెడిట్ కార్డు నుంచి ఖర్చు చేసే వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత నుంచి కొత్త స్పెండింగ్ సైకిల్ ప్రారంభమవుతుంది. అయితే, ఆగస్టు 10వ తేదీ నుంచి సెప్టెంబరు 9వ తేదీలోపు వాడుకున్న డబ్బును తిరిగి చెల్లించేందుకు సెప్టెంబరు 29వ తేదీ వరకు సమయం ఉంటుంది. సెప్టెంబరు 9వ తేదీ తర్వాత తీసుకున్న మొత్తం అక్టోబరు బిల్లింగ్ సైకిల్‌లోకి చేరుతుంది.
ఇక్కడ జాగ్రత్త సుమా..!
ఒకవేళ మీరు వాడుకున్న మొత్తాన్ని మీ బిల్లింగ్ సైకిల్ గడువు అయిపోయిన తర్వాత గనక తిరిగి చెల్లించకపోతే.. ప్రతి అదనపు రోజుకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పైన చెప్పిన తేదీలను మరోసారి పరిగణనలోకి తీసుకుందాం. మీరు ఆగస్టు 10-సెప్టెంబరు 9 మధ్య రూ.10,000 ఖర్చు చేశారనుకుందాం. దీన్ని చెల్లించడానికి మీకు 29 సెప్టెంబరు వరకు సమయం ఉంటుంది. అలాగే అవసరం రీత్యా సెప్టెంబరు 11న రూ.5,000 తీసుకున్నారనుకుందాం. ఇది అక్టోబరు బిల్లింగ్ సైకిల్‌లో చేరుతుంది. అంటే ఈ రూ.5,000 చెల్లించడానికి మీకు అక్టోబరు 29 వరకు గడువు ఉంటుంది. కానీ, మీరు ఒకవేళ సెప్టెంబరు 29 నాటికి చెల్లించాల్సిన రూ.10 వేలు చెల్లించకపోతే.. సెప్టెంబరు 30 నుంచి రూ.10 వేలతో పాటు సెప్టెంబరు 11న తీసుకున్న రూ.5,000కు కూడా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలా రూ.10వేలు తిరిగి చెల్లించే వరకు మొత్తం రూ.15 వేలకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
వీలైనంత వరకు నగదు విత్‌డ్రా వద్దు
క్రెడిట్ కార్డు పరిమితిలో కొంత మొత్తాన్ని నగదు రూపంలో తీసుకోవడానికి కూడా అనుమతి ఉంటుంది. దీంతో చాలా మంది ఈ కార్డు డెబిట్/ఏటీఎంలా వాడుతుంటారు. అయితే, అత్యవసరమైతే తప్ప.. నగదు తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే నగదు తీసుకున్న తర్వాత రోజు నుంచే వడ్డీ ప్రారంభమవుతుంది. దీనికి బిల్లింగ్ సైకిల్ అంటూ ఏమీ ఉండదు.
ఎలాంటి ఛార్జీలు? ఎంత మొత్తం వర్తిస్తాయి?
చాలా మంది క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు ఎలాంటి ఛార్జీలు వర్తిస్తాయో ఆరా తీయరు. కంపెనీ ఏజెంట్లు చెప్పింది విని తీసేసుకుంటారు. ఏఏ ఛార్జీలు, ఎంత మొత్తంలో వర్తిస్తాయో తప్పకుండా తెలుసుకోవాలి. బిల్లింగ్ సైకిల్ అయిపోయిన తర్వాత పడే వడ్డీ రేటు ఎంతో చాలా మందికి తెలియదు. అలాగే విదేశీ కరెన్సీలో కొనుగోళ్లు చేసేటప్పుడు అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. ఇలాంటివి అడిగి తెలుసుకోవాలి. అలాగే కార్డును బట్టి వడ్డీ రేటు మారుతుంటుంది. కొన్ని ప్రీమియం కార్డుల్లో వడ్డీరేటు తక్కువ ఉంటుంది. కానీ, నిర్ణీత గడువులో ఇంత మొత్తం ఖర్చు చేస్తేనే తక్కువ వడ్డీరేటు వర్తిస్తుందన్న షరతులు ఉంటాయి. వీటి గురించి కూడా తెలుసుకోవాలి.
'మినిమం అమౌంట్ డ్యూ' వలలో పడొద్దు..
మీరు చెల్లించాల్సిన మొత్తంలో కొంత మొత్తాన్ని చెల్లిస్తే వడ్డీ కట్టాల్సిన అవసరం ఉండదంటూ మీకు మెసేజ్‌లు వస్తుంటాయి. దాన్ని చూసి మీరు టెంప్ట్ అవ్వొద్దు. ఎందుకంటే మీరు తర్వాతి బిల్లింగ్ సైకిల్‌లో చేసే తొలి కొనుగోలు నుంచి బాకీ ఉన్న మొత్తానికి వడ్డీ పడుతూ ఉంటుంది. ఉదాహరణకు.. మీరు సెప్టెంబరు 29 నాటికి రూ.10 వేలు చెల్లించాలి. కానీ, రూ.5,000 చెల్లిస్తే వడ్డీ ఏమీ ఉండదు అనడంతో మీరు అంతమొత్తం చెల్లించారు అనుకుందాం. ఇక మీరు తిరిగి అక్టోబరు 5న మరో రూ.2,000 ఖర్చు చేశారనుకోండి. అప్పటి నుంచి మీకు రూ.5000+రూ.2,000లకు వడ్డీ పడడం ప్రారంభమవుతుంది.
ఇదీ చదవండి: