చెక్కుల ద్వారా చెల్లింపులను మరింత పటిష్ఠం చేసేందుకు పాజిటివ్ పే పద్ధతిని ప్రకటించింది భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ). రూ.50 వేలు, అంతకన్నా.. ఎక్కువ మొత్తంలో చెక్‌ల ద్వారా జరిపే చెల్లింపుల విషయంలో ఈ ప్రక్రియను వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ పద్ధతి నిర్వహణ నిబంధనలను ఆర్బీఐ ఇంకా విడుదల చేయాల్సి ఉంది.
సంఖ్య పరంగా దాదాపు 20 శాతం, విలువ పరంగా 80 శాతం చెక్కులు పాజిటివ్ పే ప్రక్రియలోకి రానున్న నేపథ్యంలో.. ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
పాజిటివ్ పే అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?
పాజిటివ్ పే ప్రకారం.. చెక్కులు ఇవ్వాలనుకునే వ్యక్తులు అందుకు సంబంధించిన వివరాలను చెక్కు ఇవ్వటానికంటే ముందే బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది. ఖాతా సంఖ్య, చెల్లించే మొత్తం, చెక్కు అందుకుంటున్న వ్యక్తి పేరు, చెక్కు నంబరు, చెక్కు తేదీ వంటి వివరాలు ఇందులో పొందుపరచాలి.
దీనితో ఆ వివరాలన్నింటినీ బ్యాంకులు నమోదు చేసుకుని పెట్టుకుంటాయి. చెక్కు తీసుకున్న వ్యక్తి బ్యాంకుకు వచ్చినప్పుడు ఆ వివరాలను.. చెక్కు ఇచ్చిన వ్యక్తి అందించిన వివరాలతో సరిచూస్తారు. రెండింటిలో వివరాలు సరిపోలినట్లైతేనే ఆ వ్యక్తిని డబ్బులు చెల్లిస్తారు. లేదంటే.. చెక్కు ఇచ్చిన వ్యక్తికే దానిని తిరిగి ఇచ్చేస్తారు. దీనినే పాజిటివ్ పే అంటారు.
ఐసీఐసీఐ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ పాజిటివ్ పే సేవలను 2016 నుంచి అందిస్తోంది. ఆ బ్యాంకుకు సంబంధించి ఐ-మొబైల్ యాప్‌లో చెక్కు వివరాలు, ముందు వైపు ఫొటో, వెనుకవైపు ఫొటోను.. చెక్కు ఇచ్చే ముందే నమోదు చేయవచ్చు.
"పాజిటివ్ పే చెక్కుల పద్ధతి ఆసక్తికరమైనది. రూ.50వేలు అంతకంటే ఎక్కువ విలువున్న చెక్కును అందించే వ్యక్తి.. బ్యాంకుకు చెక్కు సంబంధించిన వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. దీన్ని అమలు చేసినట్లైతే లోపాలు లేని వ్యవస్థ తయారౌతుంది."
- కే. శ్రీనివాస రావు, ప్రొఫెసర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్(ఐఐఆర్‌ఎం), హైదరాబాద్
మోసాలకు ఇలా చెక్..
బ్యాంకు జారీ చేసే చెక్కులు కాకుండా బయట ప్రింట్ చేసిన నకిలీ చెక్కులు, ఫోర్జరీ చెక్కులు.. పేరు మార్చటం, డబ్బుల విలువలో మార్పు చేయటం తదితర మోసాలను నియంత్రించటంలో పాజిటివ్ పే పద్ధతి చాలా సమర్థంగా పనిచేస్తుంది.
గత సంవత్సరం కేరళలోని కొచ్చిలో ఒక ప్రధాన కుంభకోణం బయటపడింది. క్లోనింగ్ చేసిన చెక్కుల ద్వారా మోసగాళ్లు రూ.2.6 కోట్లు తస్కరించారు. కేవలం ఐదు చెల్లింపుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకులలో ఈ పనిని చేశారు.
పాజిటివ్ పద్ధతికి సవాళ్లు..
బ్యాంకు వద్ద చెక్కుకు సంబంధించిన సమాచారం లేనట్లయితే ఈ ప్రక్రియలో ఎక్కువ విలువున్న చెక్కులు క్లియర్ కావు. కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారులు ప్రతి రోజు చాలా చెక్కులను ఇస్తుంటారు. వీరు బ్యాంకుకు సమాచారం అందించటంలో ఇబ్బంది పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
"ప్రస్తుతం ఎక్కువ విలువున్న చెక్కులను ర్యాండమ్‌గా మరోసారి తనిఖీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ అవసరమైనంత వరకు భద్రతను అందిస్తోంది. అయితే ఈ పద్ధతి ద్వారా ఫోర్జరీ సంతకంతో పాటు చెక్కుల విలువ, చెక్కు నంబరు సంబంధించి మోసపూరితంగా చేసే మార్పులను గమనించడం వీలు కాదు. పాజిటివ్ పే ఈ విషయంలో ఉపయోగపడుతుంది."
- ఓ ప్రముఖ కంపెనీ సీఎఫ్‌ఓ
కార్పొరేట్ కంపెనీలు సాధారణంగా రూ.50 వేల కంటే ఎక్కువ విలువున్న చెక్కులను రోజూ కొన్ని వేల సంఖ్యలో అందిస్తుంటాయి. కాబట్టి పాజిటివ్ పే పద్ధతిని అమలు చేయటం సవాలుతో కూడుకున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం భారతదేశంలో చెక్కులను దేశవ్యాప్తంగా ఎక్కడైనా సమర్పించవచ్చు. ఒకటి లేదా రెండురోజుల్లో వాటి క్లియరెన్స్ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో సమయానికి చెక్కుల వివరాలు బ్యాంకులకు అందించటం, బ్యాంకులు ఆ వివరాలను అప్‌డేట్ చేయటం కష్టమన్నది నిపుణుల వాదన.
గ్రామీణ, చిన్న పట్టణాలతో పాటు ఐటీ, సాంకేతికత గురించి అవగాహన తక్కువున్న వ్యాపారులు, చిన్న తరహా తయారీదారులు పాజిటివ్ పే కారణంగా ఇబ్బంది పడే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.
'ప్రస్తుతం భారత్‌లో చెక్కులను ఇచ్చేటప్పుడు బ్యాంకులకు సమాచారం అందించాలన్న ఎలాంటి చట్టపరమైన నిబంధన లేదు. మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఈ ప్రక్రియను అమలు చేయవచ్చు' అని శ్రీనివాస రావు తెలిపారు.