భారత ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. కరోనా దెబ్బకు లక్షలాది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం జరిపారు.
వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాలను ఆదుకునేందుకు అవసరమైతే రెండో ఆర్థిక ఉపశమన ప్యాకేజీ రూపొందించే విషయంపైనా చర్చించారు. దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి సహా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఛేదించడానికి నిధులు సమీకరించే అంశంపైనా ప్రధాని మోదీ ప్రత్యేకంగా చర్చించినట్లు అధికారులు తెలిపారు.
పలు అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి అంచనాలను భారీగా తగ్గించిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
లాక్డౌన్ ఎఫెక్ట్
కొవిడ్ వ్యాప్తిని నివారించడానికి విధించిన లాక్డౌన్ కారణంగా చాలా రంగాలు కుదేలయ్యాయి. విమానయానం, ఆతిథ్యం, పర్యటకం, సూక్ష్మ మధ్య స్థాయి పరిశ్రమలు, వ్యవసాయం సహా అనుబంధ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
దీంతో నష్టనివారణ చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి సలహాలు ఇచ్చే విధంగా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. వివిధ రంగాలతో పాటు పేదలకు సహాయంగా సంక్షేమ పథకాలు రూపొందించే అంశంపైనా సలహాలు ఇవ్వాలని కోరింది. ఇప్పటికే 24 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది.