కనీస రిటర్నులకు హామీనిచ్చే ఒక పింఛను పథకాన్ని తీసుకురావడానికి ద పింఛన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(పీఎఫ్‌ఆర్‌డీఏ) కసరత్తు చేస్తోంది. పీఎఫ్‌ఆర్‌ఏడీఏ ఛైర్మన్ సుప్రతిమ్ బంద్యోపాధ్యాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపాదిత పథకం విధివిధానాలపై పింఛన్ ఫండ్‌లు, గణాంక సంస్థలతో చర్చిస్తున్నట్లు ఆయన వివరించారు.
"పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టం కింద కనీస ప్రతిఫలాలకు హామీనిచ్చే పథకాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. పీఎఫ్ పథకాల కింద వచ్చే నిధులను మార్క్-టు-మార్కెట్‌లో నిర్వహిస్తారు. కాబట్టి మార్కెట్ కదలికలను బట్టి వాటి విలువలో కొంత ఊగిసలాట కనిపించవచ్చు. అయితే కొంత మంది కనీస హామీని కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే మా పింఛన్ ఫండ్ మేనేజర్లుతో చర్చిస్తున్నాం."
-సుప్రతిమ్ బంద్యోపాధ్యాయ్, పీఎఫ్‌ఆర్‌ఏడీఏ ఛైర్మన్
ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇది వస్తుందా అన్న ప్రశ్నకు.. 'మేం ప్రయత్నిస్తాం. తొలిసారిగా మేం సొంతంగా తీసుకొస్తున్న పథకం ఇది. ఇప్పటి వరకు వచ్చిన పథకాల్లో ఎటువంటి హామీ లేదు. మార్కెట్ ఎంత ప్రతిఫలాలను ఇస్తే.. వాటిని మేం వినియోగదార్లకు బదిలీ చేస్తున్నాం అంతే. పెట్టుబడుల నష్టభయం వినియోగదారుకు ఉండేది.' అని సమాధానమిచ్చారు.
నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్), అటల్ పెన్షన్ యోజన(ఏపీవై)లు ఆర్థిక శాఖతో చర్చించిన అనంతరం తీసుకొచ్చినవని బంద్యోపాధ్యాయ్ గుర్తుచేశారు. అయితే తాము ఎన్‌పీఎస్, ఏపీవైలలో పలు ఫీచర్లు ప్రవేశపెట్టామని తెలిపారు.
ఇదీ చూడండి:ఆ ఛార్జీలను తిరిగి చెల్లించాలని బ్యాంక్‌లకు సూచనలు!