జాతీయ పింఛను పథకాన్ని(ఎన్‌పీఎస్).. ముఖ్యంగా వేతన జీవులకు రిటైర్‌మెంట్ తర్వాత జీవితానికి భరోసాను అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇది సాధారణ పౌరులకు కూడా అందుబాటులో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు సెక్షన్ 80సీ కింద సూచించిన పరిమితి వరకు ఎన్‌పీఎస్‌లో మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద అదనంగా రూ.50,000 వరకు మినహాయింపు పొందవచ్చు. ఎన్‌పీఎస్ ఖాతాలో జమచేసే సొమ్ము మొత్తంలో 25 శాతం వరకు రిటైర్‌మెంట్‌కు ముందు తీసుకోవచ్చు. దీనిపై ఎటువంటి పన్ను ఉండదు. పదవీ విరమణ పొందిన తర్వాత ఎన్‌పీఎస్‌లో జమయ్యే నిధిలో 60 శాతం మేరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. మరో 40 శాతం యాన్యుటీ కొనుగోలుకు వెచ్చించాలి.
రిటైర్‌మెంట్ ప్లానింగ్ కోసం అందుబాటులో ఉన్న పథకాల్లో నష్టభయం తక్కువగా ఉన్న వాటిల్లో ఎన్‌పీఎస్సే మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఈ పథకానికి గత కొన్నేళ్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరుకు ఎన్‌పీఎస్ నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) 30 శాతం పెరిగి రూ.7.5 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు 25 నాటికి మొత్తం 18.28 లక్షల మంది ప్రైవేటు వ్యక్తులు ఎన్‌పీఎస్‌లో చేరారు. వీరిటో 12.59 లక్షల మంది కార్పొరేట్ రంగానికి చెందినవారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 22.24 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 53.79 లక్షల మంది ఎన్‌పీఎస్‌లో చేరారు.
ఈ నేపథ్యంలో ఎన్‌పీఎస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు పింఛను నిధి నియంత్రణ, అభివృధ్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) కొన్ని నిబంధనలను సడలించింది. అవేంటో చూద్దాం..
రూ.5 లక్షల నిధి మాత్రమే ఉంటే.. మొత్తం వెనక్కి..
రూ.5 లక్షల లోపు ఎన్‌పీఎస్ నిధి ఉన్నవారు పదవీ విరమణ చేసినా.. ఎన్‌పీఎస్ నుంచి బయటకు రావాలని అనుకున్నా.. మొత్తం సొమ్మును వెనక్కి తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఇప్పటివరకు ఎన్‌పీఎస్ నుంచి పెట్టుబడిని పూర్తిగా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉండేది కాదు. రూ.2లక్షల మొత్తం దాటితే.. పదవీ విరమణ తర్వాత లేదా 60 ఏళ్ల తర్వాత కనీసం 40 శాతంతో బీమా సంస్థలు అందించే యాన్యుటీ పథకాలను తప్పనిసరిగా కొనాల్సి వచ్చేది. మిగిలిన 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకునే వీలుండేది. ఇప్పుడు రూ.5లక్షల వరకూ ఎలాంటి యాన్యుటీ పథకాలను కొనాల్సిన అవసరం లేదు. అయితే ఉపసంహరణ మొత్తంలో 60% పన్నురహితంగా పరిగణిస్తారు. మిగతా 40% పన్ను పరిధిలోకి వస్తుంది.
గడువుకు ముందే బయటకు రావాలంటే..
ఎవరైనా గడువుకు ముందే ఎన్‌పీఎస్ నుంచి బయటకు రావాలనుకుంటే.. ఇప్పటి వరకు ఉన్న రూ.లక్ష పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచారు.
పథకంలో చేరే వయసు పెంపు..
ఎన్‌పీఎస్‌లో చేరేందుకు గరిష్ఠ వయసు ఇప్పటివరకు 65 ఏళ్లు ఉండగా.. దీన్ని 70 ఏళ్ల వయసుకు పెంచారు. అలాగే ఎన్‌పీఎస్ ఖాతాలను మూసివేసిన చందాదారులు పెరిగిన వయస్సు అర్హత నిబంధనల ప్రకారం కొత్త ఎన్‌పీఎస్ ఖాతాను తెరవడానికి అనుమతి ఉంది. ఎన్‌పీఎస్‌ను మరింత విస్తృతం చేసేందుకు వీలుగా ఏజెంట్లూ ఈ పథకాన్ని అందించేందుకు వీలును కల్పించారు.
75 ఏళ్ల వయసు వచ్చే వరకు..
అదే విధంగా ఈ పథకంలో 75 ఏళ్ల వయసు వచ్చే వరకు కొనసాగేందుకు పీఎఫ్‌ఆర్‌డీఏ అనుమతినిచ్చింది.
కొత్త నిష్క్రమణ నిబంధనలు..
ఎవరైనా 65 సంవత్సరాల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరితే, కనీసం మూడు సంవత్సరాలు పథకంలో కొనసాగాల్సిందే. 3 సంవత్సరాలు పూర్తి కాకముందే నిష్క్రమిస్తే ముందస్తు ఉపసంహరణగా పరిగణిస్తారు. ఒకవేళ ఎవరైనా 65 ఏళ్ల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరి.. 3 సంవత్సరాల ముందే విత్‌డ్రా చేయాలనుకుంటే.. నిధిలో 20% వరకు మాత్రమే పన్నురహిత ఉపసంహరణను అనుమతిస్తారు. మిగతా మొత్తం జీవితకాలం పెన్షన్‌గా ఉంటుంది.
ఇవీ చదవండి: