'పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తెస్తే.. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర లీటర్కు రూ.75 దిగువకు చేరుతుంది. డీజిల్ రూ.68 కన్నా తక్కువకు లభిస్తుంది' అని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంటున్నారు. అయితే చమురు ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చేందుకు రాయకీయ నేతలు సిద్ధంగా లేరని అభిప్రాయపడ్డారు.
రాజకీయపరంగా దృఢ సంకల్పం లేకపోవడం వల్లే.. ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ చేరినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కేవలం రూ.లక్ష కోట్లు (జీడీపీలో 0.4 శాతం మాత్రమే) ఆదాయం తగ్గుతుందని అంటున్నారు విశ్లేషకులు. బ్యారెల్ ముడి చమురు ధర 60 డాలర్లు, రూపాయి మారకం విలువ 73 వద్ద ఉదాహరణగా తీసుకుని ఈ అంచనాలు వేశారు.
ప్రస్తుతం రాష్ట్రాలు సొంతంగా చమురుపై పన్నులు విధిస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్రం కూడా సుంకాలు, సెస్సు వసూలు చేస్తోంది. ఈ కారణంగా పెట్రోల్ ధర లీటర్కు పలు ప్రాంతాల్లో రూ.100 మార్క్ దాటింది.
ఈ ధరల ఆధారంగా చూస్తే.. లీటర్ పెట్రోల్, డీజిల్పై వరుసగా రూ.3.82, రూ.7.25 చొప్పున రవాణా ఛార్జీలు, రూ.3.67, రూ.2.53 చొప్పున డీలర్ కమీషన్, రూ.30, రూ.20 చొప్పున సెస్సు విధిస్తున్నాయి.
'ఒక వేళ వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే అత్యధికంగా 28 శాతం పన్ను ఉంటుంది. చమురు ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే రాష్ట్రాలకు కాస్త నష్టం తప్పదు. అయితే అలా తెస్తే మాత్రం వినియోగదారులపై రూ.30 వరకు భారం తగ్గుతుంది. అప్పుడు లీటర్ పెట్రోల్ రూ. 75, లీటర్ డీజిల్ రూ. 68కే వస్తుంది' ఆర్థికవేత్తలు వివరించారు.
అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో ఇంధన ధరల్లో రోజువారీ మార్పులు చేయకుండా చమురు ధరలను స్థిరీకరించాలని కూడా ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. అంటే.. అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు వచ్చే లాభాలను, ధరలు పెరిగినప్పుడు వచ్చే లోటుతో పూడ్చుకోవాలన్నారు. అలా చేస్తే వినియోగదారులపై ఎలాంటి భారం పడదని అభిప్రాయం వ్యక్తం చేశారు.