దేశవ్యాప్తంగా సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లు 2020కి పార్లమెంటు ఆమోదం తెలిపింది.
రాజ్యసభలో మూజు వాణి ఓటు ద్వారా మంగళవారం ఆమోదం పొందిన ఈ బిల్లును సెప్టెంబర్ 16నే లోక్‌సభ ఆమోదించింది. జూన్ 26న అమలులోకి వచ్చిన బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ ఆర్డినెన్స్ 2020ని ఇది భర్తీ చేయనుంది.
సహకార బ్యాంకుల వినియోగదారుల డిపాజిట్లకు కొత్త చట్టం పూర్తి భద్రత కల్పిస్తుందని రాజ్యసభలో బిల్లుపై చర్చ సందర్భంగా స్పష్టంచేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సహకార బ్యాంకుల కోసం మాత్రమే ఈ సవరణ చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
కరొనా కాలంలో ఎన్నో సహకార బ్యాంకులు ఒత్తిడిని ఎదుర్కొన్నాయని.. వాటన్నింటిపై ఆర్బీఐ పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు సీతారామన్.
కంపెనీల చట్టం సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
కంపెనీ చట్టాల్లో సవరణలు, కంపెనీల కంపౌడింగ్ నేరాలు, సులభతర వాణిజ్యానికి సంబంధించిన.. మరో బిల్లుకు కూడా పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది.
సెప్టంబర్ 19న లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. మంగళవారం రాజ్యసభ గడప దాటింది.
కంపెనీల చట్టం సవరణ బిల్లు 2020లో.. కార్పొరేట్ల నేరాలు, చిన్న చిన్న నేరాలకు జరిమానా తగ్గించడం, విదేశాల్లో దేశీయ సంస్థల లిస్టింగ్, జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో ప్రత్యేక ధర్మాసనాల ఏర్పాటు సహా పలు ఇతర అంశాలు ప్రధానంగా ఉన్నాయి.
పన్నుల ఉపశమన బిల్లుకు పార్లమెంటు ఓకే..
కరోనా నేపథ్యంలో వివిధ ప్రొవిజన్ల కింద పన్ను ఉపశమనాలు, పన్నుల విధానంలో మార్పుల బిల్లుకూ పార్లమెంటు అమోదం తెలిపింది. రాజ్య సభలో మంగళవారం పొందిన ఈ బిల్లు సెప్టెంబర్ 19న లోక్‌సభ గడప దాటింది. పన్ను విధానంలో, పరోక్ష పన్నుల చట్టాల్లో మార్పుల కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్సును ఇది భర్తీ చేయనుంది.
రిటర్ను దాఖలుకు, ఆధార్ పాన్ అనుసంధానానికి గడువు పొడిగింపు వంటి అంశాలు ఈ బిల్లులో ప్రధానంగా ఉన్నాయి.
కరోనా నేపథ్యంలో పీఎం కేర్స్‌కు విరాళాలు ఇచ్చిన కంపెనీలకు పన్ను మినహాయింపు ఇచ్చే అంశం కూడా ఈ బిల్లులో ఉంది.
ఇదీ చూడండి:ప్రపంచ దిగ్గజ బ్యాంకుల్లో అక్రమ నిధుల బదిలీ కలకలం