2020 బడ్జెట్లో ఆరోగ్య రంగంపై మరింత దృష్టి పెట్టింది కేంద్రం. ఈ రంగానికి రూ. 69 వేల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. జల్ జీవన్ మిషన్‌కు 3.06 లక్షల కోట్లు కేటాయించారు. మిషన్ ఇంద్రధనుష్ పథకాన్ని 12 రోగాలకు విస్తరిస్తున్నట్లు వెల్లడించారు నిర్మలా. వాటిలో 5 కొత్త వ్యాధులను చేర్చినట్లు పేర్కొన్నారు.
స్వచ్ఛభారత్ ద్వారా కొత్త పథకాలు..
ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛభారత్ ద్వారా కొత్త పథకాలు తీసుకురానున్నట్లు వెల్లడించారు ఆర్థిక మంత్రి. ఆయుష్మాన్ భారత్ పథకంలో రాని ఆస్పత్రులను ఈ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. 'టీబీ హరేగా దేశ్ బచేగా' పేరుతో క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 2025 కల్లా క్షయ నిర్మూలనతోనే దేశ విజయం సాధ్యమవుతుందని అన్నారు. జీవన మార్పులతో వచ్చే రోగాల నివారణకు నూతన పథకాన్ని తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు.
బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా భారత్‌ను రూపొందించేందుకు.. ఓడీఎఫ్ ప్లస్ ద్వారా పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు.