దేశ రాజధాని దిల్లీలో ఉల్లి, టమాటా ధరలు మళ్లీ మండిపోతున్నాయి. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ.. దిల్లీలో ఉల్లి, టమాటా కిలోకు రూ.60 నుంచి 70 వరకు పలుకుతోంది. ప్రాంతం, నాణ్యతల ఆధారంగా ధరల్లో వ్యత్యాసం ఉంటోంది.
వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. జాతీయ రాజధాని ప్రాంతంలో కిలో ఉల్లి రూ.55గా ఉండగా.. టమాటా కిలో రూ.53 వద్ద ఉన్నట్లు తెలిసింది.
ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం గత నెల.. సరఫరా పెంచడం వంటి చర్యలు తీసుకుంది. అయినప్పటికీ ధరలు ఇంకా అధికంగానే కొనసాగుతుండటం గమనార్హం. ఉల్లి, టమాటాను అధికంగా పండించే మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా.. సరఫరా తగ్గి ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.
రానున్న రోజుల్లో ఖరీఫ్ పంట మార్కెట్లోకి రానుంది. ఆ తర్వాత ధరలు సాధారణ స్థితికి చేరుతాయని వినినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ఇటీవల ఉల్లి, టమాటా ధరలు కాస్త తగ్గుముఖం పట్టినా.. భారీ వర్షాలు సరఫరాకు ఆటంకంగా మారాయి. ఈ కారణంగా రిటైల్ మార్కెట్లో ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ ప్రభావం ఉత్తర భారత్‌పై అధికంగా ఉంది. రానున్న పది రోజుల్లో.. పరిస్థితులు మారే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: భారత్‌లో కొత్తగా మరో 100 విమానాశ్రయాలు!