దేశంలో ఇంకా ఉల్లి కష్టాలు తీరినట్లు కనిపించడం లేదు. పలు నగరాల్లో కిలో ఉల్లి ధర రూ.150గా ఉన్నట్లు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. దేశంలో లభ్యత పెంచి, ధరలు నియంత్రించేందుకు విదేశాల నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటోంది ప్రభుత్వం. అయినప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో ధరలు అదుపులోకి రాకపోవడం గమనార్హం.
వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. మెట్రో నగరాలైన కోల్కతాలో కిలో ఉల్లి రూ.120, దిల్లీ, ముంబయిలలో రూ.102, చెన్నైలో రూ.80గా ఉన్నట్లు వెల్లడైంది.
"దిగుమతి చేసుకుంటున్న ఉల్లి దేశానికి చేరుకుంటుంది. ఇప్పటికే 1,160 టన్నులు భారత్కు చేరింది. ఇంకా 10,560 టన్నుల ఉల్లి వచ్చేనెల 3-4 తేదీల్లో వచ్చే అవకాశముంది. పసుపు, ఎరుపు ఉల్లిపాయలను టర్కీ, ఈజిప్టు, అఫ్గానిస్థాన్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ముంబయి పోర్టుకు ఈ దిగుమతులు చేరుకుంటాయి."
- వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి
కేంద్రం తరఫున ప్రభుత్వ రంగ.. మెటల్స్, మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ) 49,500 టన్నుల ఉల్లి దిగుమతికి ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో కొంత మొత్తం వచే నెలలో భారత్కు చేరే అవకాశముంది.
ధరలు ఎందుకు పెరిగాయంటే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఉల్లి పంట గతేడాది కన్నా.. 25 శాతం తగ్గింది. రుతుపవనాలు ఆలస్యంగా రావడం.. ఆ తర్వాత ఉల్లి అధికంగా పండే రాష్ట్రాల్లో అధిక వర్షాలు పడటం కారణంగా ధరలు ఆకాశాన్నంటాయి. ఈ కారణంగా ప్రభుత్వం కొన్ని చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా ఎగుమతులు నిలిపివేయడం.. దళారుల వద్ద నిల్వలపై పరిమితులు విధించడం వంటి నిర్ణయాలు తీసుకుంది.
అయితే ఉల్లి ధరలు వచ్చే ఏడాది జనవరి వరకు.. ఎక్కువగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు వ్యాపారులు. ఖరీఫ్ పంట మార్కెట్లోకి వస్తే ధరలు సాధారణ స్థాయికి రావచ్చని అంటున్నారు.
గతంలో చూస్తే.. ధరలు భారీగా పెరగటం కారణంగా.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 1,987 టన్నుల ఉల్లి దిగుమతి చేసుకుంది.