కరోనా కారణంగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ.. ఊహించిన దానికంటే వేగంగా వృద్ధి రేటు నమోదు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆశించిన దానికంటే అదనంగా డిమాండ్ పెరగటం వల్లే ఇది సాధ్యమవుతున్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు.
ఆర్బీఐతో పరస్పర సహకారం..
ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ పరస్పర సహకారంతో పనిచేస్తున్నట్లు సీతారామన్ తెలిపారు. ఇటీవల పెరుగుతున్న ద్రవ్యోల్బణం కాలానుగుణమేనన్నారు. అయితే ఆహార పదార్థాల ధరల్లో ఎలాంటి పెరుగుదల నమోదు కాలేదని పేర్కొన్నారు. వరసగా రెండు నెలలు రూ.లక్ష కోట్ల జీఎస్టీ వసూలు నమోదైందన్న సీతారామన్.. పరిశ్రమలు తమ వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రచించుకోవటం పెరిగిన డిమాండ్‌కు నిదర్శనమని వివరించారు.
రైతుల సమస్యలు పరిష్కరిస్తాం..
నూతన వ్యవసాయ చట్టాలపై మాట్లాడిన ఆర్థిక మంత్రి రైతులు ఆదాయాలను పెంపొందాలనే ఉద్దేశంతోనే చట్టాలను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. త్వరలోనే రైతులతో చర్చించి వారి సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి:'ఆర్బీఐ అంచనాలకన్నా వేగంగా రికవరీ'