బొమ్మల తయారీ, ఎగుమతులను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో బొమ్మల పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాబోయే బడ్జెట్లో 'టాయ్స్' విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విధానం దేశంలో టాయ్స్ పరిశ్రమకు అనుకూల వాతావరణాన్ని కల్పించటమే కాకుండా అంకుర పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పడనుందని పేర్కొన్నాయి.
దేశీయంగా ఉత్పత్తయ్యే బొమ్మలను ప్రోత్సహించే దిశగా వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇప్పటికే చర్యలు చేపట్టింది. గత ఏడాది బొమ్మల దిగుమతిపై సుంకాన్ని పెంచింది. నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయటం ద్వారా.. దేశీయ మార్కెట్లలోకి వెల్లువెత్తుతున్న నాసిరకం బొమ్మలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ప్రపంచ బొమ్మల విపణిలో భారత ఎగుమతులు కేవలం 0.5 శాతం మాత్రమే.
అభివృద్ధి .. పరిశోధన..
ఈ విభాగంలో అపారమైన అవకాశాలు ఉన్నందున.. నూతన విధానాన్ని అనుసరించి ఇతర రంగాల మాదిరి పరిశోధన, అభివృద్ధికి ప్రోత్సాహాలు ఇవ్వాలని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి. తద్వారా ఉత్పత్తిని గణనీయంగా పెంచి.. దేశీయ బొమ్మల ఎగుమతిని పెంచేందుకు ఈ విధానం దోహాదపడుతుందని భావిస్తున్నారు. చైనా, వియత్నాం వంటి దేశాలు ఈ రంగంలో అతిపెద్ద వాటాదారులుగా ఉన్నాయి. భారతదేశ బొమ్మల ఎగుమతులు కేవలం 100 మిలియన్ డాలర్లు మాత్రమే కాగా.. వీటిలో 85శాతం దిగుమతులే ఉంటున్నాయి. చైనా నుంచే అధికంగా భారత్లోకి బొమ్మలు దిగుమతి అవుతున్నాయి.
వోకల్ ఫర్ లోకల్..
దేశంలో 4,000 చిన్న, మధ్యతరహా సంస్థలు మాత్రమే ఉన్నాయి. బొమ్మల ఉత్పత్తికి కేంద్రంగా మారే ప్రతిభ భారతదేశానికి ఉందని గతంలో ప్రధాని మోదీ మాన్ కీ బాత్లో ప్రస్తావించారు. 'వోకల్ ఫర్ లోకల్'నినాదాన్నిచ్చిన మోదీ స్థానిక బొమ్మల సామర్థ్యాన్ని గుర్తించాలని స్టార్టప్‌లకు సూచించారు.