కొవిడ్-19 సృష్టించిన సంక్షోభాన్ని సంస్కరణలు కొనసాగించే అవకాశంగా భారత్ మలుచుకుంటోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య-సీఐఐ నిర్వహించిన జాతీయ ఎంఎన్సీ కాన్ఫరెన్స్-2020లో నిర్మల పాల్గొని వ్యాఖ్యానించారు. ఈ సంస్కరణలు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
కరోనా సమయంలోనూ లోతైన సంస్కరణలు తెచ్చే అవకాశాలను ప్రధాని వదులుకోలేదన్నారు. సంస్కరణలు కొనసాగుతాయన్న కేంద్ర ఆర్థికమంత్రి అందుకు అనుగుణంగా క్రియాశీలక చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెట్టుబడుల ఉపసంహరణ అజెండాను కొనసాగిస్తామని వివరించారు.
"సవాళ్లు విసిరే ఈ పరిస్థితుల్ని అవకాశాలుగా మార్చుకునేందుకు ప్రధాని మోదీ సమయం వృధా చేయలేదు. మన బలాన్ని ఎలా అనుకూలంగా మార్చుకోవాలనే అంశంపైనే దృష్టి పెట్టారు. దిగుమతులు ఆపలేదు. అంతర్జాతీయ వాణిజ్యం నుంచి భారత్‌ను దూరంగా పెట్టలేదు. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ పాత్రను తిరస్కరించలేదు. భారత్ అతిపెద్ద పెట్టుబడుల కేంద్రంగా మారాలి. అందుకు అనుగుణంగా ప్రతీ అంశాన్ని మేము సరిచేశాం."
--నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి.