దేశీయ తయారీ రంగ కార్యకలాపాలు ఏడు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. మరోసారి కరోనా విజృంభిస్తుండడం వల్ల మార్చిలో గిరాకీ క్షీణించింది. ఈ ప్రభావం ఉత్పత్తి కార్యకలాపాలపైనా పడినట్లు ఐహెచ్‌ఎస్ మార్కిట్ నెలవారీ నివేదిక వెల్లడించింది.
ఫిబ్రవరిలో 57.5గా ఉన్న మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ(పీఎంఐ) గత నెల 55.4కు తగ్గింది. అయితే, దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న 53.6 సగటు కంటే ఎక్కువే ఉండడం గమనార్హం.
పీఎంఐ సూచీ 50 ఎగువన నమోదైతే వృద్ధి సాధించినట్లు, అంతకంటే తక్కువగా ఉంటే క్షీణించినట్లు పరిగణిస్తారు.
ఉద్యోగ కల్పనపైనా ప్రభావం..
మార్చిలో కొత్త ఆర్డర్లు తగ్గాయని.. దీంతో తయారీ నెమ్మదించిందని ఐహెచ్‌ఎస్ మార్కిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో తయారీ కార్యకలాపాలతో పాటు కొనుగోళ్లు కూడా నేలచూపులు చూశాయని తెలిపింది. మరోసారి కరోనా కేసులు పెరగడమే అందుకు కారణమని వివరించింది.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కఠిన ఆంక్షల విధింపు నేపథ్యంలో భారత పరిశ్రమలకు ఏప్రిల్ నెల సవాల్ విసరనుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఉద్యోగ కల్పనపై కొవిడ్ ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉందని పేర్కొంది.
ఇదీ చదవండి:మొబైల్ వ్యాపారానికి ఎల్జీ గుడ్‌బై