గడిచిన 5 త్రైమాసికాల నుంచి వృద్ధిరేటు పడిపోతున్న వేళ.. 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న ప్రధాని నరేంద్రమోదీ ఆశయం నెరవేరే దాఖలాలు కనిపించడం లేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మోదీ నిర్దేశించుకున్న లక్ష్యం చేరాలంటే వృద్ధిరేటు కనీసం 9 శాతం నమోదు కావాలని... ప్రస్తుతం 5 శాతమే ఉందని చెప్పారు.
వాహన రంగానికి సంబంధించి ప్రభుత్వం ఏదో ఒక ప్యాకేజీతో రాకుంటే.. దాదాపు 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మన్మోహన్ హెచ్చరించారు. దేశం అతి భయంకరమైన ఆర్థికమాంద్యం దిశగా పరుగులు పెడుతోందని... కేంద్రం త్వరగా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇప్పటి వరకు కేంద్రం చేపట్టిన చర్యలన్నీ తాత్కాలిక మెరుగులే కానీ వచ్చే ఉపద్రవాన్ని అడ్డుకోవడానికి ఏ మాత్రం ఉపకరించేలా లేవని ఏఐసీసీ సమావేశంలో చెప్పారు మన్మోహన్. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులుగా తాము మాత్రమే చెప్పడం లేదని.. పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారన్నారు.
విపక్షంగా ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత తమపై ఉందని శ్రేణులకు వివరించారు మన్మోహన్ . ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కేంద్రం ప్రకటనలన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించేవేనని మన్మోహన్ పేర్కొన్నారు.
ఇదీ చూండండి: పుట్టినరోజు నాడు తిహార్ జైల్లో గడపనున్న చిదంబరం