వచ్చే నెలతో (మార్చి) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. మార్చి 31లోపు పన్ను సేవింగ్స్ సంబంధించిన ప్రణాళికలను అమలు చేసుకోవాల్సి అవసరముంది.
ఆదాయపు పన్ను ప్రయోజనాలకోసం అందుకు తగ్గ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. పన్ను ప్రయోజనాలు కల్పించేందుకు కావాల్సిన పెట్టుబడులు సంవత్సరం మొత్తం చేయటం ఉత్తమం. ఇప్పటికే ఆ దిశగా పెట్టుబడులు పెట్టనట్లయితే.. ఈ మిగిలిన సమయంలో ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. పన్ను ప్రయోజనాలు కల్పించే పెట్టుబడుల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
ప్రజా భవిష్య నిధి
పన్ను ప్రయోజనాలు పొందేందుకు పీపీఎఫ్ ఎక్కువ ప్రాముఖ్యత కలది. సౌర్వభౌమ గ్యారంటీ ఉన్నందున ఎలాంటి రిస్కు ఉండదు. దీనిలో త్రైమాసికాల వారీగా వడ్డీ సమీక్షకు అవకాశం ఉంది. ప్రస్తుతం పీపీఎఫ్ పై వడ్డీ రేటు 7.1గా ఉంది.
ఇది 15 సంవత్సరాల గడువుతో వచ్చినప్పటికీ.. మధ్యలో కొంత మొత్తం పెట్టుబడిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. పిల్లల ఉన్నత చదువు, రిటైర్మెంట్ ప్లానింగ్ లాంటి దీర్ఘకాల లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టాలనుకునే వారు పీపీఎఫ్‌ను ఎంచుకోవచ్చని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఫిక్సెడ్ డిపాజిట్లు(ఎఫ్డీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
ఇందులో ఐదు సంవత్సరాల బ్యాంకు డిపాజిట్లు లేదా ఐదు సంవత్సరాల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లు చాలా పాపులల్ గా ఉన్నాయి. ఏదైనా పోస్ట్ బ్యాంకు ద్వారా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో పెట్టుబడి పెట్టవచ్చు. వీటిపై 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. బ్యాంకు ఫిక్సెడ్ డిపాజిట్లపై ప్రస్తుతం వడ్డీ రేట్లు 5 నుంచి 6.9 శాతం వరకు లభిస్తున్నాయి. ఫిక్సెడ్ డిపాజిట్ల ద్వారా త్రైమాసికం లేదా వార్షికంగా వడ్డీ పొందే వీలు ఉంటుంది. అదే ఎన్ఎస్సీలో మాత్రం ఈ వెసులుబాటు లేదు. ఎన్ఎస్సీలో వడ్డీ కాంపౌండ్ అవుతుంది. మెచ్యురిటీ సమయంలో పూర్తి మొత్తం ఒకే సారి పొందవచ్చు.
స్వల్ప కాల ఆర్థిక లక్ష్యాలను, అల్పాదాయ పెట్టుబడిదారులు ఎన్ఎస్సీ లేదా పన్ను సేవింగ్ ఎఫ్డీలను ఉపయోగించుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్
సెక్షన్ 80 సీ ప్రకారం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా పన్ను ప్రయోజనం పొందవచ్చు. ఇది పూర్తి ఈక్విటీ ఆధారిత పథకం. ఇది ఓ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ఇందులో కనీసం 80 శాతం ఈక్విటీలో పెట్టుబడి ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడి కనీసం మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. దీర్ఘకాలంలో ఇతర పెట్టుబడుల కంటే ఈఎల్ఎస్ ఎస్ పెట్టుబడి ద్వారా మంచి రాబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలో సిప్ ద్వారా కూడా పెట్టుబడి చేయవచ్చు.
యునిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు..
యునిట్ లింక్డి ఇన్సూరెన్స్ ప్లాన్లు(యులిప్)లు పెట్టుబడితో పాటు బీమాను అందిస్తాయి. వీటిని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అందిస్తుంటాయి. కనీసం ఐదు సంవత్సరాల పాటు పెట్టుబడిని కొనసాగించాల్సి ఉంటుంది. మార్కెట్ గమనానికి అనుగుణంగా రిటర్న్ లను అందిస్తాయి. సమర్థవంతంగా పన్ను ప్రయోజనాలు పొందేందుకు స్టాక్స్, బాండ్ల మధ్య మార్పిడి చేసుకోవచ్చు.
యులిప్ లు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. ప్రీమియం చెల్లించని పక్షంలో ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నది గుర్తించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి:'స్ల్పింటర్నెట్' దిశగా ఇంటర్నెట్!