ఈ ఏడాది ఫిబ్రవరిలో నికర ఉద్యోగాల సృష్టి 8లక్షల 61వేలకు చేరిందని ఉద్యోగ భవిష్య నిధి కార్యాలయం(ఈపీఎఫ్ఓ) విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.
గతేడాది ఏప్రిల్‌లో మొదటిసారిగా ఉద్యోగాల సృష్టికి సంబంధించిన గణాంకాలను వెల్లడించింది ఈపీఎఫ్‌వో. 2017 సెప్టెంబర్ నుంచి గతేడాది ఫిబ్రవరి వరకు వివరాలను అప్పుడు విడుదల చేసింది.
ప్రస్తుత గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా 8లక్షల 94వేల ఉద్యోగాల సృష్టి జరిగింది. గత నెలలో అంచనా ప్రకారం ఈ సంఖ్య 8లక్షల 96వేలుగా ఉంది.
22-25 ఏళ్ల మధ్య వారే అధికం
ఫిబ్రవరిలో అత్యధికంగా 2లక్షల 36వేల ఉద్యోగాలను 22-25 మధ్య వయసు వారు పొందారు. రెండో స్థానంలో 2లక్షల 9వేల ఉద్యోగాలతో 18-21 ఏళ్ల వారు ఉన్నారు.
ఫిబ్రవరి వరకు 80లక్షల 86వేలు
2017 సెప్టెంబర్ నుంచి 2019 ఫిబ్రవరి వరకు 18 నెలల్లో 80లక్షల 86వేల ఉద్యోగాల సృష్టి జరిగినట్లు ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయి.
2017 సెప్టెంబర్ నుంచి 2019 జనవరి వరకు ఈ సంఖ్యను 72లక్షల 24వేలకు తగ్గించింది ఈపీఎఫ్ఓ. ఇది క్రితం నెలలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం 76లక్షల 48వేలుగా ఉంది.
మార్చి 2018కు సంబంధించి ఈపీఎఫ్ఓ పథకం నుంచి వైదొలిగిన వారి సంఖ్యలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. క్రితం నెల గణాంకాల ప్రకారం వీళ్ల సంఖ్య 29,023గా ఉండగా... ప్రస్తుతం 55,934కు పెరిగింది. 2019 ఫిబ్రవరిలో విడుదలైన గణాంకాల ప్రకారం... మార్చి 2018లో 5,498 మంది ఈపీఎఫ్ఓ పథకాల్లో చేరారు.
ఇదీ పద్ధతి...
వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగం పొందినవారు తప్పకుండా ఈపీఎఫ్ఏలో చేరాలి. దీని ఆధారంగానే ఉద్యోగ గణాంకాలను విడుదల చేస్తోంది సంస్థ. ఈపీఎఫ్‌లో చేరిన వారి సంఖ్య నుంచి వెళ్లిపోయిన వారి సంఖ్యను తీసివేయగా నికర ఉద్యోగాల సంఖ్య వస్తుంది.