లాక్డౌన్ కారణంగా దేశంలో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. మార్చి నెలలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 16.7 శాతం క్షీణించినట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేశాయి. గతేడాది ఇదే సమయంలో(2019 మార్చి) పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 2.7 శాతం పెరిగింది.
మైనింగ్, తయారీ, విద్యుత్ రంగాలపై తీవ్ర ప్రభావం పడటం వల్ల పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించినట్లు తెలుస్తోంది. జాతీయ గణాంక సంస్థ వివరాల ప్రకారం.. 2019 మార్చిలో 3.1 శాతం వృద్ధి కనబర్చిన తయారీ రంగం... 2020 మార్చిలో 20.6 శాతం క్షీణించింది. గతేడాది మార్చిలో విద్యుత్ ఉత్పత్తి 2.2 శాతం పెరగ్గా... 2020 మార్చిలో ఉత్పత్తి 6.8 శాతం తగ్గిపోయింది.
2018-19లో ఐఐపీ 3.8 శాతం వృద్ధి చెందగా... 2019-20 సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 0.7 శాతానికి పడిపోయింది.