ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య నిరుద్యోగ రేటు తగ్గినట్లు కేంద్రం ప్రకటించింది. 2019 జనవరి-మార్చి మధ్య 9.3 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. 2018 ఏప్రిల్-జూన్‌లో నిరుద్యోగ రేటు 9.8 శాతంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. 2018 తొలి త్రైమాసిక సమాచారం లేనందున.. ఏప్రిల్-జూన్ మాసాల డేటాతో పోల్చారు.
గణాంకాలు, కార్యక్రమాల అమలు ప్రణాళిక మంత్రిత్వ శాఖ త్రైమాసిక బులెటిన్‌ను శనివారం విడుదల చేసింది.
ఈ గణాంకాల ప్రకారం.. నిరుద్యోగ రేటు ఈ ఏడాది జనవరి-మార్చి పురుషుల్లో 8.7 శాతానికి, మహిళల్లో 11.6 శాతానికి తగ్గినట్లు తెలిసింది. గతేడాది ఏప్రిల్-జూన్‌లో ఈ రేట్లు వరుసగా 9 శాతం, 12.8 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది.
పెరిగిన శ్రామిక శక్తి..
పట్టణ ప్రాంతాల్లో మొత్తం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ (ఎల్ఎఫ్పీఆర్) రేటును 2019 జనవరి-మార్చిలో 36 శాతంగా ఉన్నట్లు అంచనా వేసింది కేంద్ర గణాంకాల విభాగం. 2018 ఏప్రిల్-జూన్ మధ్య 35.6 శాతం ఉన్నట్లు తెలిపింది.
ఇందులో పురుషుల ఎల్ఎఫ్పీఆర్ అంచనా 56.2 శాతంగా, మహిళల ఎల్ఎఫ్పీఆర్ అంచనా 15 శాతంగా ఉన్నట్లు గణాంకాల్లో తెలిసింది.
ఇదీ చూడండి:ఉద్దేశపూర్వక ఎగవేతదారుల్లో మెహుల్ ఛోక్సీ కంపెనీ నెం.1