కరోనా సంక్షోభం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుదేలైందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వెల్లడించింది. ఈ కారణంగా దేశ వృద్ధి రేటు ఈ ఏడాది 10.3శాతం క్షీణించే అవకాశముందని అంచనా వేసింది. భారత్‌లో రెండో త్రైమాసికంలో అంచనా వేసిన దాని కంటే చాలా తక్కువ జీడీపీ నమోదవుతున్నట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది
అయితే 2021లో మాత్రం చైనా కన్నా అధికంగా(8.2 శాతం).. 8.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసి.. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని భారత్ తిరిగి పొందుతుందని 'వరల్డ్ ఎకానమిక్ ఔట్లుక్'లో ఆశాభావం వ్యక్తం చేసింది ఐఎంఎఫ్.
ఇతర దేశాల వృద్ధి రేటు ఇలా..
2020లో అమెరికా జీడీపీ రేటు 5.8 శాతం క్షీణించొచ్చు. 2021లో తిరిగి 3.9 శాతం సానుకూల వృద్ధి రేటును నమోదు చేసే వీలుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో చైనా మాత్రమే ఈ ఏడాది సానుకూల వృద్ధి రేటు (1.9 శాతం) నమోదు చేసే అవకాశముంది.
ప్రపంచ వృద్ధిపై ఆందోళన..
కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్థిక మాంద్యం ఎదుర్కోనున్నట్లు ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కారణంగా ప్రపంచ వృద్ధి రేటు ఈ ఏడాది -4.4 శాతంగా నమోదుకావచ్చని అంచనా వేసింది. తిరిగి 2021లో ప్రపంచ వృద్ధి రేటు 5.2 శాతానికి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది ఐఎంఎఫ్.