పేమెంట్స్ బ్యాంకులు చాలా కాలంగా డిపాజిట్ పరిమితిని పెంచాలని కోరుతున్నాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల బ్యాంకులను ప్రోత్సహించే ప్రయత్నంలో, ఆర్‌బీఐ బుధవారం పేమెంట్స్ బ్యాంకుల గరిష్ఠ డిపాజిట్స్‌ను రూ. 2 లక్షలకు పెంచినట్లు ప్రకటించింది. అంతకుముందు ఈ గరిష్ఠ పరిమితి రూ. 1 లక్ష మాత్రమే.
గరిష్ఠంగా రూ.2 లక్షలు..
నవంబర్ 27, 2014న జారీ చేసిన పేమెంట్స్ బ్యాంకుల లైసెన్సింగ్ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో వినియోగదారుని గరిష్ఠ బ్యాలెన్స్ రూ. 1 లక్ష కలిగి ఉండటానికి ఆర్‌బీఐ అనుమతించింది. పేమెంట్స్ బ్యాంకుల పనితీరుపై సమీక్ష ఆధారంగా వారి ప్రయత్నాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఆర్థిక లక్ష్యాలతో పాటు.. ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులతో సహా వారి వినియోగదారుల అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని విస్తరించేందుకూ గరిష్ఠ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచింది ఆర్‌బీఐ.
పేమెంట్స్ బ్యాంకుల ప్రధాన లక్ష్యం వలస కార్మికులు, తక్కువ ఆదాయ గృహస్తులు, చిన్న వ్యాపారులు, ఇతర అసంఘటిత రంగ సంస్థలు, చిన్న పొదుపు ఖాతాలకు, చెల్లింపులు, ఆర్థిక సేవలను అందించడం. పేమెంట్స్ బ్యాంకులను ప్రారంభించడానికి 2015 ఆగస్టులో ఆర్‌బీఐ 11 సంస్థలకు సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. దేశంలో మొట్టమొదట ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభమైంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) జనవరి 2017లో 2 పైలట్ బ్రాంచ్‌లలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇతర పేమెంట్స్ బ్యాంకులలో ప్రధానమైనవి 'పేటిఎం' పేమెంట్స్ బ్యాంక్, 'ఫినో' పేమెంట్స్ బ్యాంక్.
ఈ బ్యాంకులన్నీ ప్రస్తుతం సాధారణ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లనే అందిస్తున్నాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, పేమెంట్స్ బ్యాంకులు ఫిక్స్‌డ్ లేదా రికరింగ్ డిపాజిట్లను అంగీకరించవు. పేమెంట్స్ బ్యాంకుకు ఎలాంటి రుణం, క్రెడిట్ కార్డు ఇవ్వడానికి అనుమతి లేదు.
ఆర్‌బీఐ, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) మరియు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టీజీఎస్) సౌకర్యాలను డిజిటల్ చెల్లింపుల మధ్యవర్తులకు విస్తరించింది. ఇప్పటి వరకు బ్యాంకులు మాత్రమే ఈ 'ఆర్‌టీజీఎస్', 'నెఫ్ట్' చెల్లింపుల సదుపాయాన్ని ఉపయోగించడానికి అనుమతించారు.
ఇవీ చదవండి: 2021-22లో ఆర్‌బీఐ ఎంపీసీ తొలి సమీక్ష హైలైట్స్
కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్‌బీఐ