ప్రజలు ఖర్చు చేసేందుకు వీలుగా నగదును వారికి అందించాలి.. ‘బడ్జెట్ 2021-22’లో కేంద్ర ప్రభుత్వానికి ఇదే ప్రధాన లక్ష్యం. ప్రభుత్వానికి ఒక్కసారిగా ఇంత జాలి ఎందుకు కలిగింది..? అనుకుంటున్నారా. దీనికో కారణం ఉంది. ప్రజలు ఖర్చు చేస్తేనే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. అప్పుడే ఉద్యోగాలు.. జీఎస్‌టీ ఆదాయం రెండూ పెరుగుతాయి. ఇందుకోసం ఆదాయపు పన్ను చెల్లించే వారికి తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇవి పన్ను శ్లాబుల్లో మార్పుగానీ.. స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో కానీ లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది.
ఈ సారి బడ్జెట్‌లో ప్రభుత్వం ఇన్‌కమ్‌ట్యాక్స్ చెల్లింపుదారులకు మొత్తం మీద చెల్లించాల్సిన దానిలో రూ.50,000-రూ.80,000 వరకు లబ్ధి చేకూర్చవచ్చు. ఇప్పటికే ఈ అంశంపై ఆర్థిక శాఖలో చర్చలు జరిగినట్లు సమాచారం. పన్ను విధించే ఆదాయం పరిధి పెంచడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
గతేడాది ప్రభుత్వం మరో కొత్త శ్లాబ్‌ల విధానం కూడా ప్రవేశపెట్టింది. అప్పటికే ఉన్న శ్లాబ్‌లను కూడా కొనసాగించింది. పన్ను చెల్లింపుదారులు తమకు నచ్చిన విధానాన్ని అనుసరించవచ్చని పేర్కొంది. కానీ, పన్ను చెల్లింపుదారులు కొత్త విధానం వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. వీటిలో పెద్దగా డిడక్షన్లకు అవకాశం లేకపోవడమే కారణంగా నిలిచింది. ఈ నేపథ్యంలో పాత ఆదాయపు పన్ను విధానంలోనే స్టాండర్డ్ డిడక్షన్‌ను ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది. సాధారణంగా వ్యక్తుల వేతనాల ఆదాయం నుంచి స్టాండర్డ్ డిడక్షన్‌ను వర్తింపజేస్తారు. ఫలితంగా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. 2020లో ఆదాయపు పన్నులో మరో మూడు కొత్త శ్లాబులను కూడా తీసుకొచ్చారు.
మరోపక్క ఆంగ్ల వార్త సంస్థ మింట్‌తో ఫిక్కి ప్రతినిధి మాట్లాడుతూ ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను ఈ ఏడాది సుమారు రూ.లక్ష వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా వర్క్‌ఫ్రం హోం కారణంగా చాలా మంది ఉద్యోగులు ఇంట్లో ఆఫీస్ ఏర్పాటు చేసుకొన్నారు. ఇందుకు కొంత మొత్తం ఖర్చయింది. ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇలాంటి ప్రతిపాదన చేయవచ్చని పేర్కొన్నారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలని సూచించింది.
ఇదీ చదవండి:లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే 2020-21