ఆర్థిక మాంద్యం భయాలను మరింత పెంచుతూ భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ 6.1 శాతంగా ఉండనున్నట్లు ఐఎంఎఫ్ తాజా ముఖచిత్రంలో వెల్లడించింది.
తొలుత ఈ ఏడాది ఏప్రిల్లో భారత వృద్ధి 7.3 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. వాహన, రియల్టీ, బ్యాంకింగేతర ఆర్థిక రంగాల్లో నెలకొన్న అనిశ్చితుల కారణంగా వృద్ధి అంచనాలు ఏకంగా 6.1 శాతానికి తగ్గించింది.
ప్రస్తుతం కాస్త ఒడుదొడుకులున్నా 2020లో జీడీపీ తిరిగి పుంజుకుంటుందని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ 7.0 శాతానికి పెరగొచ్చని అంచానా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెంచేందుకు ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొంది.
ప్రపంచ బ్యాంకు కూడా ఇటీవల.. భారత ఆర్థిక వృద్ధిని 6.9 శాతం నుంచి 6.0 శాతానికి పరిమితం చేస్తూ అంచనాలు సవరించడం గమనార్హం.
చైనా వృద్ధి అంతంత మాత్రమే...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను చైనా జీడీపీ కూడా 6.1 శాతంగానే ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అయితే వచ్చే ఆర్థిక సంత్సరం ఆ దేశ వృద్ధి మరింత క్షీణించి 5.8 శాతానికి పరిమితం కావొచ్చని అభిప్రాయపడింది.
ఆందోళనకరకంగా ప్రపంచ వృద్ధి..
ప్రపంచ వ్యాపంగా నెలకొన్న వాణిజ్య అనిశ్చితులు, సరిహద్దు భయాల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి ఆందోళనకరంగా ఉన్నట్లు ఐఎంఎఫ్ హెచ్చరించింది. 2019కి గాను ప్రపంచ వృద్ధి అంచనాను 3 శాతానికి తగ్గించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటి నుంచి వృద్ధి మందగిస్తున్నట్లు పేర్కొంది. 2017లో 3.8 శాతంగా ఉన్న వృద్ధి 3 శాతానికి తగ్గడం ఆందోళనకరమని ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ అన్నారు.
ఇదీ చూడండి: ఫేస్బుక్ 'లిబ్రా' కరెన్సీ రావడం ఖాయం!