బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అంకురాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఏంజెల్ పన్ను సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అధికారుల వేధింపులుండవు...
పెట్టుబడిదారులు, అంకురాలు డిక్లరేషన్ ఇచ్చి, రిటర్నులలో పొందుపరిస్తే.. షేర్ల ప్రీమియం విలువపై ఎలాంటి తనిఖీ ఉండదని ప్రకటించారు. పెట్టుబడిదారుల గుర్తింపు కోసం, వారి నుంచి వచ్చే నిధులు మూలాల కోసం ఈ-వెరిఫికేషన్ వ్యవస్థను తీసుకువస్తామని తెలిపారు. ఈ విధానంలో ఆదాయ పన్ను అధికారుల నుంచి తనిఖీలు పేరుతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు ఆర్థికమంత్రి.
పెండింగ్‌లో ఉన్న అంకురాల అసెస్మెంట్, ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు నిర్మల. ఉన్నతాధికారి అనుమతి లేకుండా అసెసింగ్ అధికారి విచారణ, వెరిఫికేషన్ ఉండదని తెలిపారు.
ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్‌కు ఊతం...
ప్రస్తుతం క్యాటగిరీ-1 ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్లలో ఉన్న వారితో పాటు మరికొందరికి ఇచ్చిన అంకుర షేర్లకు ఫేర్ మార్కెట్ విలువను సరిచూడాల్సిన అవసరం లేదు. ఈ మినహాయింపును క్యాటగిరీ-2కు కూడా వర్తింపచేసింది కేంద్రం.
ఆదాయ పన్ను చట్టం ప్రకారం అంకురాలు ఫేర్ మార్కెట్ విలువ కంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పొందినట్లయితే అందులో 30 శాతాన్ని పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇదే ఏంజెల్ పన్ను. ఈ ఏడాది ఫిబ్రవరిలో అంకురాల నిర్వచనాన్ని మార్చిన కేంద్రం.. ఏంజెల్ పన్ను మినహాయింపును 25 కోట్లకు పెంచింది. మొత్తం 540 అంకురాలు ఈ మినహాయింపు ద్వారా లబ్ధిపొందాయి.
మూలధన లాభాలు...
అంకురాల్లో పెట్టుబడులు పెట్టటానికి ఇళ్లు అమ్మగా వచ్చిన డబ్బును ఉపయోగిస్తే... మూలధన లాభాలపై విధించే పన్ను నుంచి మినహాయింపును 2021 మార్చి 31 వరకు పొడగించారు. ఇందుకు సంబంధించి కొన్ని నిబంధనలనూ సడలించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు ఆర్థికమంత్రి.
అంకురాల్లో 51 శాతం వాటా, 100 శాతం వాటా కలిగి ఉంటే వచ్చిన నష్టాలను వచ్చే సంవత్సరానికి బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అంకురాల్లో ఓటింగ్ హక్కుల కోసం కావాల్సిన వాటాను 25 శాతానికి తగ్గించారు.
ప్రత్యేక ఛానల్...
అంకురాలకు సంబంధించి ప్రత్యేక ఛానల్ తీసుకురానుంది కేంద్రం. ఇది అంకురాలకు సంబంధించి పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు లాంటి వారికి చర్చా వేదికగా ఉండనుంది.
- ఇదీ చూడండి: బడ్జెట్: సంస్కరణలతో అభివృద్ధి పయనం