ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని తెలుస్తోంది. రైతులందరికీ స్వచ్ఛందంగా బీమా అందించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. అయితే బీమా జాబితా నుంచి అధిక ప్రీమియం పంటలను తొలగించాలని యోచిస్తోస్తున్నట్లు తెలుస్తోంది. బీమా జాబితాలో కొన్ని పంటలను చేర్చేందుకు రాష్ట్రాలకూ అధికారం ఇవ్వనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
వ్యవసాయ బీమా వల్ల ఇన్సూరెన్స్ సంస్థలు మాత్రమే లాభాలు పొందుతున్నాయనే అపోహను తొలగించేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నిధి ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
2016లో ప్రారంభమైన ఈ పథకం పంటవేసే ముందు నుంచి కోతలు ముగిసిన అనంతర కాలం వరకూ బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. బీమా ప్రీమియం ప్రస్తుతం ఖరీఫ్ పంటలకు 2 శాతం, రబీకి 1.5 శాతం, ఉద్యానపంటలకు 5 శాతం స్వీకరిస్తోంది ప్రభుత్వం.
నష్టపోయిన రైతుల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో అన్ని పంటలకు స్వచ్ఛందంగా బీమా సౌకర్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పంటలో 50 శాతానికి మించి నీటి సౌకర్యం ద్వారా సాగయితే.. 25 శాతం నష్టపోయినా బీమా అందించేందుకు కేంద్రం యోచిస్తోందని తెలుస్తోంది. పంటకు నీటి సౌకర్యం 50 శాతం లోపు ఉన్నట్లయితే 30 శాతం వరకు మాత్రమే బీమాను అందించాలని నిర్ణయించిందని సమాచారం.
పంట నష్టాన్ని అంచనా వేసేందుకు రెండు దశల ప్రక్రియనూ చేపట్టాలని నిర్ణయించింది కేంద్రం. మొదటిది ప్రకృతి విపత్తుల కారణంగా జరిగిన నష్టం ఆధారంగా, రెండోది విపత్తు ప్రాంతాల్లో నష్టాన్ని పూడ్చుకునేందుకు వివిధ క్షేత్రాల్లో జరిగిన పరిశోధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
ఇదీ చూడండి: కర్ణాటకీయం: రాజీనామాలపై నేడు సుప్రీం విచారణ