దేశంలో ప్రస్తుతం ఉన్న నల్లధనంపై అధికారిక అంచనాలు లేవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే నల్లధనాన్ని అరికట్టేందుకు మాత్రం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
దేశంలో ఉన్న నల్లధనం అంచనా ఎంత? అది పెరగటానికి కారణాలు ఏంటనే ప్రశ్నలకు సమాధానంగా ఠాకూర్ ఈ విషయాలు వెల్లడించారు. ప్రభుత్వం అప్రమత్తంగా లేనందునే నల్లధనం పెరుగుతుందా? అనే ప్రశ్నను ఠాకూర్ తోసిపుచ్చారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో భాజపా గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నల్ల ధనాన్ని వెనక్కి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఎన్నికల్లో భాజపా హామీ ఇచ్చింది. నల్ల ధనాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు.
నూతన చట్టం అందుకే..
విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని వెనక్కి రప్పించేందుకు 'నల్ల ధనం, అపరాధ పన్ను చట్టం 2015'ను... 2015 జులై నుంచి అమల్లోకి తెచ్చినట్లు ఠాకూర్ పేర్కొన్నారు. బినామీ చట్టం 1988ని సవరించి 2016లో కొత్త బినామీ చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ చట్టం ద్వారా బినామీ ఆస్తుల జప్తు సహా బినామీదారు, బినామీ లబ్ధిదారు ఇద్దరినీ న్యాయపరంగా విచారించేందుకు వీలుకలుగుతుందని పేర్కొన్నారు.
లావాదేవీల విషయంలో రూ.2 లక్షలకు మించి బదిలీపై ఆంక్షలు ఉన్నట్లు గుర్తు చేశారు ఠాకూర్. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు రూ.2,000 దాటితే వాటిని ఎలక్టోరల్ బాండ్లు, బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే ఇచ్చేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.
"పాన్కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశాం. దీని ద్వారా నకిలీ పాన్లను నిలువరించడం సహా పన్ను ఎగవేత, మనీ ల్యాండరింగ్ మోసాలను ఆరికట్టగలుగుతున్నాం."
- అనురాగ్ ఠాకూర్, ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి
ఇదీ చూడండి: ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు