రాబోయే త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు నియంత్రించాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. తద్వారా ద్రవ్య పరపతి విధాన వడ్డీ రేట్ల కోత బదిలీ వేగవంతం చేయాలని చూస్తోంది.
ప్రస్తుత త్రైమాసికంలో బ్యాంక్ డిపాజిట్ రేట్లను ప్రభుత్వం క్రమబద్దీకరించినప్పటికీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సీ) వంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించలేదు. చిన్న మొత్తాల పొదుపు పతకాలపై అధిక వడ్డీరేట్లు కొనసాగడం వల్ల తాము డిపాజిట్ రేట్లను తగ్గించడం కుదరడం లేదని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. ప్రస్తుతం ఏడాది మెచ్యూరిటీ గల చిన్నమొత్తాలు, బ్యాంకు డిపాజిట్ల మధ్య 100 బేసిస్ పాయింట్ల అంతరం ఉంది.
సీనియర్ సిటిజన్స్ (వయో వృద్ధులు) సేవింగ్స్ పథకానికి వడ్డీ రేటును 8.6 శాతంగా ఉంచగా, పొదుపు డిపాజిట్లకు మాత్రం ఏడాదికి 4 శాతం వడ్డీని యథాతథంగా ఉంచింది. 2020 జనవరి-మార్చి త్రైమాసికంలో సుకన్య సమృద్ధి యోజనకు వడ్డీరేటు 8.4 శాతం చేస్తామని పేర్కొంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ వంటి చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా 7.9 శాతంగానే ఉంచింది ప్రభుత్వం. గతేడాది డిసెంబర్ 31న తీసుకున్న ఈ నిర్ణయంలో కిసాన్ వికాస్ పత్ర రేటును 7.6 శాతంగా ఉంచింది.
మరిన్ని కీలక నిర్ణయాలు
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఆర్థికరంగాన్ని గాడిన పెట్టేందుకు.. వచ్చే ద్రవ్య విధాన సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపు సహా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సంకేతాలిచ్చింది ఆర్బీఐ.