కరోనా ప్రభావం వల్ల 2020లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కాస్త కోలుకుంటుందని వరల్డ్ బ్యాంక్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల ప్రాథమికంగా ప్రారంభమైన కరోనా టీకా ప్రక్రియ.. ఏడాది చివరి నాటికి విస్తృతం అవుతుందని అంచనా వేసింది. ఈ సానుకూలతల నేపథ్యంలో 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశముందని పేర్కొంది.
అయితే కరోనా మహమ్మారి నుంచి గట్టెక్కేందుకు చర్యలు తీసుకోకపోతే, పెట్టుబడులు పెంచే దిశగా విధానకర్తలు సంస్కరణలు తీసుకురాకుంటే మాత్రం ఆర్థిక రికవరీ నెమ్మదిస్తుందని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన 'గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్' నివేదికలో పలు కీలక విషయాలు ప్రస్తావించింది.
భాారత్పై అంచన ఇలా..
కరోనా మహమ్మారి ప్రభావంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 9.6 క్షీణించవచ్చని అంచనా వేసింది వరల్డ్ బ్యాంక్. ఇది ప్రైవేటు పెట్టుబడులు, గృహ వ్యయాలలో తగ్గుదలను సూచిస్తోందని పేర్కొంది. అయితే.. 2021లో భారత్ పుంజుకుని 5.4 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
దక్షిణాసియా ప్రాంతం 2021లో 3.3 శాతం వృద్ధి రేటును కనబర్చే వీలుందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది.