భారత్‌కు మరో ఉద్దీపన ప్యాకేజీ అవసరమని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అభిప్రాయపడుతోంది. ఆరోగ్య, ఆహార రంగాల్లో వ్యయాలకు, ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఆదాయ మద్దతుకు, వ్యాపారులకు చేయూత ఇవ్వడానికి ఉద్దీపన అవసరమని పేర్కొంది.
'కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించిన తీరుకు మేం మద్దతు ఇస్తున్నాం. అల్పాదాయ కార్మికులు, ప్రజలకు, ఆర్థిక రంగం కోసం చేపట్టిన ద్రవ్యలభ్యత చర్యలు బాగున్నాయి. అయితే మరింత ద్రవ్య ఉద్దీపన కావాలని మేం భావిస్తున్నామని' ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ విభాగ డైరెక్టర్ గెర్రీ రైస్ చెప్పారు. కరోనా కారణంగా తాజా త్రైమాసికంలో జీడీపీ భారీగా క్షీణించడంపై వర్చువల్ సమావేశంలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విధంగా స్పందించారు.
భారత అభివృద్ధి, పేదరికంపై కరోనా ప్రభావం ఎంచదగ్గరీతిలోనే ఉండబోతోందని ఆయన అంచనా వేశారు. వైరస్ కట్టడికే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.