వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేతకు పాల్పడుతున్న కంపెనీలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (సీబీఐసీ).జీఎస్టీ నమోదుకు మొదట చేసుకున్న దరఖాస్తును రద్దు చేయకుండానే కొత్త దరఖాస్తు చేసుకునే కంపెనీలపై దృష్టి సారించాలని ఆదాయ పన్ను శాఖను ఆదేశించింది.
ప్రస్తుతం ఉన్న జీఎస్టీ నమోదు ప్రక్రియలో లోపాల కారణంగా జీఎస్టీ వసూళ్లు తగ్గి... లక్ష్యాలు అందుకోవడం కష్టమవుతోందని సీబీఐసీ పేర్కొంది.ప్రధానంగా జీఎస్టీ నమోదు ప్రక్రియలో లొసుగులను ఉపయోగించుకుని కొన్ని వందల కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడుతున్న కంపెనీలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది సీబీఐసీ.
జీఎస్టీకి మొదట దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏ కారణంతోనైనా అది ఆమోదం పొందకపోతే ఆ విషయాన్ని రెండో సారి దరఖాస్తు చేసుకున్నప్పుడు సంబంధిత శాఖకు తెలపాలి. అయితే కంపెనీలు ఆ విషయాన్ని దాచి రెండోసారి దరఖాస్తు చేసుకుంటున్నాయి. రెండవ సారి దరఖాస్తుకు ఆమోదం లభిస్తే... అప్పటి నుంచే జీఎస్టీ చెల్లిస్తున్నాయి. దీంతో మొదటిసారి దరఖాస్తుకు, రెండోసారి దరఖాస్తుకు మధ్యనున్న కాలానికి జీఎస్టీని ఎగ్గొడుతున్నాయి.
ఇలా రీ-రిజిస్ట్రేషన్ మార్గంలో జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నట్లు గుర్తించిన సీబీఐసీ తాజా నిబంధనలను తీసుకువచ్చింది. ఇందుకు రిజిస్ట్రేషన్ వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని సూచించింది.
దరఖాస్తు చేసిన కంపెనీల పాన్ ఆధారంగా ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ వివరాలను తెలుసుకోవాలని... వాటి ద్వారా ఏమైనా పాత బాకీలు ఉంటే వాటినీ పన్నులో లెక్కగట్టి వసూలు చేయాలని పేర్కొంది.
బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రూ. 7.43 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లకుగానూ... రూ. 6.43 లక్షల కోట్లు మాత్రమే వస్తాయని సీబీఐసీ అంచనా వేస్తోంది.