విదేశాలకు పంపే డబ్బుపై మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్)ను ప్రవేశపెట్టింది కేంద్రం. ఆర్థిక సంవత్సరంలో విదేశీ చెల్లింపులు రూ.7 లక్షలకు మించితే అదనపు మొత్తంపై టీసీఎస్ అమలు చేస్తారు. ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
అయితే, విదేశీ పర్యటనల (ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజీ) చేసే ఖర్చు మొత్తానికి టీసీఎస్ వర్తిస్తుంది. 'ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజీ' అంటే ఇతర దేశం/దేశాలు/ భూభాగం/ భూభాగాల పర్యటనలుగా నిర్వచిస్తారు. అంతేకాకుండా.. ఇందులో ప్రయాణ/హోటల్ బస/బోర్డింగ్/ ఇతర ఖర్చులు కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
వారికి 10 శాతం..
ఇలా.. విదేశీ చెల్లింపులు రూ.7 లక్షలు దాటితే అదనపు మొత్తం, విదేశీ పర్యటనల మొత్తం ఖర్చుపై 5 శాతం పన్ను వసూలు చేస్తారు. ఈ బాధ్యతను ఆర్బీఐ పరిధిలోని సరళీకృత చెల్లింపుల పథకం(ఎల్ఆర్ఎస్) నిర్వహిస్తుంది. ఆధార్, పాన్ లేని పక్షంలో పన్ను రేటు 10 శాతంగా ఉంటుంది.
కానీ, ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి పొందిన విద్యారుణం పంపించే సందర్భాల్లో.. రూ .7 లక్షలకు మించిన మొత్తంపై టీసీఎస్ రేటు 0.5 శాతం ఉంటుంది.
ఆర్థిక చట్టం ద్వారా..
ఎల్ఆర్ఎస్ నిబంధనల ప్రకారం.. ఏటా గరిష్ఠంగా 2.5 లక్షల డాలర్లను విదేశాలకు పంపే అవకాశం ఉంది. విదేశీ చెల్లింపులపై పన్ను వసూలును చేయటాన్ని ఆర్థిక చట్టం-2020లో ప్రవేశపెట్టారు. దీనికి మార్చి 27న ఆమోదం లభించింది.
ఇదీ చూడండి: 'రుణ గ్రహీతలకు సుప్రీం మరింత ఉపశమనం'