సాధారణంగా ఆర్థికపరమైన అంశాల్లో ఎక్కువ మంది చేసే అలావాట్లు వాటి నుంచి తప్పించుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
1. ఆలస్యంగా బిల్లుల చెల్లింపు
మనం ఎన్నో సేవలు పొందుతుంటాం. వాటన్నింటికీ ప్రత్యేకమైన బిల్లింగ్ తేదీ అంటూ ఉంటుంది. ప్రతినెలా ఈ బిల్లులన్నింటిపై దృష్టిసారించడం ఒక రకంగా కష్టమే. ఆలస్యంగా చెల్లించి, అందుకు రుసుములు చెల్లించడమంటే జరిమానా చెల్లింపుతో సమానం. అంటే, కష్టపడి సంపాదించినదాన్ని ఒక రకంగా వృథా చేయడమే. దీన్ని అరికట్టేందుకు బిల్లుల చెల్లింపు ‘ఆటోమేట్’ చేయండి. నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డు నుంచి ఆయా బిల్లులు నేరుగా, నిర్ణీత తేదీనాడు చెల్లింపులు జరిగిపోయేలా సూచనలు ఇవ్వండి. ఇలా చేస్తే.. ఆలస్యం జరిగి సేవల్లో అంతరాయం ఏర్పడటంలాంటివి నిరోధించడమే కాదు.. అనవసర జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు.
2. వాయిదాల చెల్లింపులో అలసత్వం
ఒకసారి రుణం తీసుకున్నామంటే.. దాని వాయిదాల చెల్లింపులు ఎప్పటికప్పుడూ క్రమం తప్పకుండా చూసుకోవాలి. చెల్లించకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఉండవనుకుంటే.. పొరపాటే అవుతుంది. అప్పు తీసుకున్న సంస్థ నుంచి మీ రుణ చరిత్రను తీసుకుని, సిబిల్ వంటి క్రెడిట్ రేటింగ్ సంస్థలు నమోదు చేస్తుంటాయి. ఆలస్య చెల్లింపులకు సంబంధించిన కారణాలేమైనా ఉండొచ్చు. అవి వాస్తవమైనా లేదా పూర్తిగా మీ నిర్లక్ష్యమే కారణమైనా దాని ప్రభావం మీ రుణ చరిత్రపై పడుతుంది. ఫలితంగా మీ క్రెడిట్ స్కోరు తగ్గి, కొత్త రుణం, క్రెడిట్ కార్డులను తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది. మీ చెల్లింపులు ఎల్లప్పుడూ సకాలంలో జరిగేలా చూసుకోండి. నిజంగానే మీరు ఏదైనా సమస్యలో ఉంటే, దానిని సంబంధిత రుణ సంస్థతో చర్చించి, చెల్లింపుల నిబంధనల్లో మార్పులు చేయించుకోండి.
3. 'కనీసం' చెల్లించడం..
క్రెడిట్ కార్డు వాడటం మాత్రమే సరిపోదు.. దానికి సంబంధించిన బిల్లులు కూడా ఎప్పటికప్పుడు చెల్లించాలి. కానీ, కొంతమంది ఎప్పటికప్పుడు కనీస మొత్తం చెల్లించి నడిపించేస్తుంటారు. అత్యవసరం అయి, పూర్తి బిల్లు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇది కొంత వరకూ నయమే. క్రెడిట్ కార్డుపై బాకీ అంటే మీరు తీసుకునే అప్పుల్లో చాలా ఖరీదైనది. ఎంత తక్కువ మొత్తం బాకీ ఉంటే ఆర్థికంగా అంత క్షేమం. కాబట్టి, నెలనెలా కార్డు బాకీని ఒకేసారి, సకాలంలో చెల్లించేయండి.
4. ఖర్చు ముందు.. పొదుపు తర్వాత..
డబ్బు రాగానే ఖర్చు చేద్దాం.. పొదుపు గురించి నెలాఖరున ఆలోచిద్దాం.. ఈ అలవాటు.. పెద్ద పొరపాటు.. పొదుపు, మదుపులకు పెద్ద అవరోధం. ముందు పొదుపు చేయాలి.. తర్వాతే ఖర్చు చేయాలి అనే నిబంధనను విధించుకోవాలి. ఆర్థిక ప్రణాళికలో ఇది అతి ముఖ్యమైన వ్యూహం. ఖర్చుల నియంత్రణకూ ఇది మంత్రంలా పనిచేస్తుంది.
5. బీమా.. పట్టించుకోకపోవడం..
ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో బీమా తీసుకోవడమే చాలామందికి అలవాటు. అదీ పన్ను మినహాయింపు కోసమే అనుకుంటారు. ఒకసారి ఈ మినహాయింపు పొందాక.. ఆ పాలసీ అమల్లో ఉందో లేదో కూడా తెలీదు. దురదృష్టవశాత్తూ వారికి ఏదైనా జరిగితే.. వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు అది ఏమాత్రం ఉపయోగపడదు. మంచి బీమా పాలసీ అంటే.. కుటుంబ సభ్యులకు మీ తర్వాత.. మీ ఆదాయానికి ప్రత్యామ్నాయం చూపేదిగా ఉండాలి. కాబట్టి, మీపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు వారి అవసరాలన్నింటినీ జాగ్రత్తగా గణించి, ఎంత బీమా తీసుకోవాలో తెలుసుకోండి.
6. ‘పన్ను’ ప్రణాళికలో హడావుడి
పన్ను ప్రణాళిక ఎప్పుడూ క్రియాశీలకంగా ఉండాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో హడావుడిగా పెట్టుబడులు పెట్టడం సరికాదు. సరైన పన్ను ప్రణాళికతో మంచి రాబడిని కూడా ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది. ముందుగా మీరు చెల్లించాల్సిన పన్ను ఎంతన్నది గణించండి. దీని భారం తగ్గించుకునేందుకు ఎంత మేరకు, ఏయే పథకాల్లో మదుపు చేయాలో నిర్ణయించుకోండి.
7. ఆరోగ్య బీమా తీసుకోరు..
ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎవరికైనా, ఎప్పుడైనా సంభవించవచ్చు. రానురానూ వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. క్యాన్సర్ వంటి జబ్బులకు చికిత్స తీసుకోవడానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆసుపత్రిలో చికిత్స కోసం చేరినప్పుడు మీరు ఇప్పటివరకూ సంపాదించిన మొత్తానికి గండిపడకుండా.. మీ లక్ష్యాలు గాడి తప్పకుండా ఉండాలంటే.. చిన్న వయసు నుంచే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. మీ కుటుంబంలోని అందరికీ ఉపయోగపడేలా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి.
8. బడ్జెట్ లేకుండా..
డబ్బు నిర్వహణలో ఆదాయ వ్యయాల పట్టిక (బడ్జెట్) ఎంతో కీలకం. ప్రాధాన్య వ్యయాలైన ఇంటి అద్దె, నిత్యావసరాలు ఎలాగూ తప్పవు. పెట్టుబడులకు కేటాయింపులు కూడా ఉండాలి. ఇక కొన్ని ఖర్చులు పూర్తిగా మీ ఇష్టానుసారం ఉంటాయి. వీటిపట్లే జాగ్రత్తగా ఉండాలి. నగదును నిర్వహణలో లెక్కలు, మీ బ్యాంకు, డెబిట్/క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్లను తరచూ గమనిస్తూ ఉంటే.. మీ నగదు ఎలా వెళ్తొందో తెలుస్తుంది. అప్పుడు అనవసర ఖర్చులు తగ్గించుకొని, పొదుపు మొత్తాన్ని పెంచుకోవచ్చు.
9. విశ్రాంత జీవితం సంగతి..
పదవీ విరమణ పొందిన తర్వాత ఎలాంటి ఆదాయం లేని జీవితాన్ని హించుకోండి.. భయమేస్తుంది కదూ! ఈ పరిస్థితిని నివారించాలంటే.. మీకు మీరే అప్పు ఉన్నట్లు భావించుకోండి. ప్రతినెలా దీనికోసం ఒక వాయిదాను కేటాయించండి. చాలామంది యువత పదవీ విరమణ అవసరాన్ని గుర్తించడం లేదు. చివరికి ఎప్పటికో ఆలోచించే సరికి ఆలస్యం అవుతోంది. ఇప్పటి నుంచే కొన్ని వేల రూపాయలను ‘సిప్’ చేస్తే.. పదవీ విరమణ సమయానికి కోట్ల రూపాయలు మీ చేతిలో ఉంటాయి.
10. అత్యవసర నిధి ఉందా?
ఎప్పుడు ఏ అత్యవసరం వస్తుందన్న సంగతిని ఎవరూ చెప్పలేం. ఉద్యోగం కోల్పోవడం, ఆస్తులకు నష్టం వాటిల్లడం, కుటుంబంలోని ఎవరికైనా ఏదైనా అనుకోని అనారోగ్యం ఇవన్నీ ఆర్థిక అత్యవసరాలే. ఇక్కడ మనం చేయాల్సిందల్లా.. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మన దగ్గర కావాల్సినంత డబ్బుతో సిద్ధంగా ఉండటమే. 3-6నెలల ఖర్చులను తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలి. ఈ మొత్తాలను సులభంగా వెనక్కి తీసుకునే చోట జమ చేయాలి. అప్పుడే ఏ అత్యవసరమైనా మీరు తేలిగ్గా అధిగమించగలరు.
- అధిల్ శెట్టి, సీఈఓ, బ్యాంక్బజార్డాట్కామ్
ఇదీ చూడండి:బడ్జెట్ అర్థం కావాలంటే శాస్త్రీ తరగతులు వినాల్సిందే!