భారత వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా తగ్గే అవకాశముందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వినియోగం క్షీణించడం, పెట్టుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఎగుమతులు తగ్గడం ఇందుకు కారణమని తెలిపింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ వృద్ధి రేటును 7.2 శాతం నుంచి 7 శాతానికి సవరించింది కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్ఓ). గడచిన ఐదేళ్లలో ఇదే అత్యల్ప వృద్ధి రేటు.
"వృద్ధి రేటు తగ్గినప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. భవిష్యత్తులో మరింత అభివృద్ధిలో పుంజుకునే అవకాశం ఉంది." -అర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్థిక వృద్ధి సవాళ్ల గురించి చర్చిస్తూ... వ్యవసాయ రంగంలోనూ వద్ధి రేటు పెరగాల్సిన అవసరం ఉందని తెలిపింది.
కరెంట్ ఖాతా లోటు 2018-19 నాలుగో త్రైమాసికంలోనూ తగ్గిపోనుండటం.. ద్రవ్యలోటు ఎఫ్ఆర్బీఎం లక్ష్యానికి చేరువలో ఉండటం భారత ఆర్థిక వ్యవస్థకు కలిసిరానుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
2018-19 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అల్ప స్థాయిలో ఉంది. ఫలితంగా రిజర్వు బ్యాంకు నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమావేశంలో రెపో రేటును తగ్గించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు గత రెండు సమావేశాల్లో రెపో రేటును 0.25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించింది ఎంపీసీ. 2016లో ఎంపీసీ ఏర్పాటైన తర్వాత వరుసగా రెండు సార్లు రెపో రేటును తగ్గించడం ఇదే ప్రథమం.
ఇదీ చూడండి: రేపూ పని చేయనున్న బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి