ప్రపంచ వృద్ధిలో భారత్, అమెరికా, చైనాల.. పాత్ర కీలకంగా ఉందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.
భారంగా రుణ లభ్యత..
కొవిడ్ టీకాలు, వాతావరణ మార్పులు, రుణాలు, ఆర్థిక పునరుద్ధరణ సహా పలు అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించారు. రుణ ప్రక్రియలో ఉన్న అసమానతలతో పేద దేశాలు ఇబ్బందులు పడుతున్నాయన్న మాల్పాస్.. ఫలితంగా చిన్న వ్యాపారులు, మహిళా ఔత్సాహిక వ్యాపారవేత్తలు, కొత్తగా వ్యాపారంలోకి వచ్చినవారు నిలదొక్కుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రుణ లభ్యతలో వారికి అనేక అడ్డంకులు ఉంటాయని అభిప్రాయపడ్డారు.
మందకొడిగా టీకా పంపిణీ
ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడటానికి జీ-20 కామన్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేసేందుకు.. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ కలిసి పనిచేస్తున్నాయని మాల్పాస్ వివరించారు. పలుదేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా జరగుతుండటం నిరాశ కలిగించిందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. త్వరలో వ్యాక్సినేషన్ వేగవంతం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు టీకా తీసుకోవడం ప్రపంచం కోలుకోవడంలో ముఖ్యభూమిక పోషిస్తుందన్నారు.
ఇవీ చదవండి: 'కొవిడ్‌తో వారిలో తీవ్రమైన అసమానతలు'