దేశ ఎగుమతులు నవంబర్లోనూ భారీగా తగ్గాయి. గత నెల మొత్తం ఎగుమతులు 8.74 శాతం తగ్గి.. 23.52 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రసాయనాలు, రత్నాలు, ఆభరణాల షిప్మెంట్లలో క్షీణతే ఇందుకు కారణమని అధికారిక గణాంకాల్లో తేలింది.
ఇదే సమయంలో దేశ దిగుమతులూ 13.32 శాతం తగ్గి.. 33.39 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో నవంబర్లో వాణిజ్య లోటు 9.87 బిలియన్ డాలర్లకు దిగొచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.
చమురు దిగుమతులు నవంబర్లో 43.36 శాతం తగ్గి 6.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
2020-21 గణాంకాలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య మొత్తం ఎగుమతులు 17.76 శాతం తగ్గి..173.66 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు ఏకంగా 33.55 శాతం తగ్గి 215.69 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఈ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో దేశ వాణిజ్య లోటు 42 బిలియన్ డాలర్లుకు దిగొచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో వాణిజ్య లోటు 113.42 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం.
ఇదీ చూడండి:'కరోనా కాలంలోనూ ఎఫ్డీఐల జోరు'