కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో డీలా పడ్డ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో రెండు-మూడు రోజుల్లో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశముందని భావిస్తున్నట్టు కేంద్ర సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
"అందరినీ ఎలా రక్షించాలన్నదానిపై మేము మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి ప్యాకేజీ వస్తుందని అనుకుంటున్నా. దాని కోసమే ఎదురు చూస్తున్నాం." -నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి
రుణాలు తిరిగి చెల్లించే అంశంలో రిజర్వు బ్యాంకు మూడు నెలల మారటోరియం విధించినప్పటికీ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని అన్నారు గడ్కరీ.
తెలంగాణలోని పరిశ్రమ వర్గాలతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న గడ్కరీ.. పరిశ్రమల పట్ల ప్రభుత్వం సానుకూల వైఖరితోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ పరిమితులను కూడా పరిశ్రమ వర్గాలు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. జపాన్, అమెరికాల మెగా ఆర్థిక ప్యాకేజీలపై స్పందించిన ఆయన.. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు భారత్ కన్నా ఎంతో పెద్దవని పేర్కొన్నారు.
ప్రధానికి సలహాలు..
జీఎస్టీ సహా, ఆదాయ పన్ను రీఫండ్లను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతాలకు సత్వరమే బదిలీ చేసేలా ఓ యంత్రాంగాన్ని రూపొందించాలని ఆర్థిక శాఖకు సూచించినట్లు గడ్కరీ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ వర్గాలతో సమావేశంలో భాగంగా వారి నుంచి వచ్చిన సూచనలు, సిఫార్సులను ఆర్థిక శాఖ సహా ప్రధానమంత్రికి చేరవేసినట్లు వెల్లడించారు.