కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రతికూల ప్రభావం నుంచి దేశంలోని చాలా మంది పేదలను ఆర్థికంగా కాపాడేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం వేగంగా పనిచేస్తోంది. లాక్డౌన్ కాలంలో 80 కోట్ల మంది పేద ప్రజలకు ఆహారం, ఇంధనంతో పాటు కొంత నగదును అందించాలని లక్ష్యంతో పీఎం గరీబ్ కల్యాణ్ పథకం ప్రకటించింది.
ఈ పథకం కింద 20.40 కోట్ల మంది మహిళల జన్‌ధన్ ఖాతాల్లో నెలకు రూ.500 చొప్పున 3 నెలలు అందించనుంది కేంద్రం. పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసిన రోజే 20 కోట్లకు పైగా మహిళల జన్‌ధన్ ఖాతాదారుల సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది.
తొలిసారిగా జన్‌ధన్..
జన్‌ధన్ ఖాతాల్లో నగదు బదిలీకి సంబంధించి సర్కారు సంసిద్ధమైన తీరును ప్రభుత్వ రంగ బ్యాంకుకు చెందిన ఓ సీనియర్ అధికారి ఈటీవీ భారత్ కు తెలిపారు. జన్‌ధన్ పథకాన్ని 2014లోనే ప్రారంభించినా మొదటిసారి ఈ ఏడాది లబ్ధిదారులకు నగదు బదిలీ చేస్తోందని వివరించారు.
"మార్చి 26న ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. మహిళల ఖాతాల వివరాలు అదే రోజు అందించాలని అందులో పేర్కొంది. డీఎఫ్ఎస్ నుంచి ఆదేశాలు రాగానే ఈ జన్‌ధన్ ఖాతాల్లోకి డబ్బులను బ్యాంకులు బదిలీ చేస్తాయి."
- ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారి
కేంద్ర ఆర్థిక శాఖకు డీఎఫ్ఎస్ నోడల్ విభాగంగా పనిచేస్తుంది. దేశంలోని బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సంస్థలను పర్యవేక్షిస్తుంది. గరీబ్ కల్యాణ్ పథకం లబ్ధిదారులకు సంబంధించి 20.40 కోట్ల ఖాతాల వివరాలను మార్చి 26నే డీఎఫ్ఎస్ సేకరించింది.
ఎన్పీసీఐ సహకారంతో..
ఈ సమాచారాన్ని భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్పీసీఐ)తో డీఎఫ్ఎస్ పంచుకుంది. ఎన్పీసీఐలో భారీ సంఖ్యలో నగదు బదిలీకి సంబంధించిన మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ (ఎంఐఎస్) ఉందని అధికారి తెలిపారు. అయితే 20 కోట్ల ఖాతాల్లోకి నిధులను తరలించటంలో ఎలాంటి సమస్య లేదని .. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఇందుకు తగిన ఏర్పాట్లను చేసినట్లు వెల్లడించారు.
కిసాన్ సమ్మాన్ పథకం..
జన్‌ధన్‌తో పాటు కిసాన్ సమ్మాన్ నిధి కింద 8.7 కోట్ల మంది రైతుల ఖాతాలు తమ వద్ద ఉన్నట్లు ఆయన అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో వీరికి మొదటి విడత కింద రూ.2 వేలు ప్రభుత్వం చెల్లించనుందని తెలిపారు. వీరి డేటాను ఎంఎస్ ఎక్సల్ రూపంలో ఎన్పీసీఐ బ్యాంకులకు పంపిస్తే అందుకు అనుగుణంగా బ్యాంకులు నగదును బదిలీ చేస్తాయన్నారు.
"గత అనుభవాల కారణంగా ఎన్పీసీఐ ద్వారానే బ్యాంకులకు లబ్ధిదారుల సమాచారాన్ని డీఎఫ్ఎస్ అందిస్తుంది. ఇదే విధంగా ఉజ్వల పథకం కింద 8 కోట్ల మంది లబ్ధిదారుల సమాచారం బ్యాంకుల వద్ద ఉంది. ఇప్పటికే వీరికి ఎల్పీజీ రాయితీని ఆ ఖాతాల్లో జమ చేస్తున్నాయి బ్యాంకులు."
- ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారి
(కథనం-కృష్ణానంద్ త్రిపాఠి)
ఇదీ చూడండి: కరోనాపై పోరులో బ్యాంకుల పాత్ర అంత కీలకమా?