ఎవరైనా ఉద్యోగి ధనికుడిగా పదవీవిరమణ పొందాలంటే అందుకు ఎంతో డబ్బుతో పాటు శ్రమ కూడా అవసరం. కొంత మంది 35 ఏళ్ల వయస్సులోనే రిటైర్ అవుతుంటారు. మరికొందరు 65 ఏళ్లు వచ్చే వరకు కష్టపడుతుంటారు. అయితే ధనికుడిగా రిటైర్ అయ్యేందుకు మీరు ఆరు లేదా ఏడు అంకెల జీతం సంపాదించాల్సిన అవసరం లేదు. అందుకు కావాల్సిందల్లా సరైన ప్రణాళిక, దాన్ని తూ.చ. తప్పకుండా పాటించే క్రమశిక్షణ మాత్రమే. అలా కాకుండా ధనవంతుడిగా రిటైర్ అవ్వలేదు అంటే మీరు చేస్తున్న ఈ ఎనిమిది తప్పులు కారణం కావచ్చు. ఆ తప్పులేంటి? వాటికి పరిష్కారాలు ఎలా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదాయం పెంచుకునేందుకు మొగ్గుచూపకపోవడం..
మీరు మీ నెలవారీ ఆదాయన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టకుంటే.. భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. ఒకవేళ మీరు పార్ట్ టైం జాబ్స్, మీ కలల ఉద్యోగం కోసం వెతుకుతున్నా.. మీ ప్రస్తుత ఆదాయం రెట్టింపు చేసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందే.
ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించకుండా.. కేవలం వస్తున్న ఆదాయన్నే సరిపెట్టుకుంటూ పోతే భవిష్యత్‌లో ఈ పరిణామం మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల్లో పడేస్తుంది. అందుకోసం మీరు ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేయాలి.
పొదుపుపై నిర్లక్ష్యం..
మీరు ధనికుడిగా రిటైర్ అవ్వలేదు అంటే అందుకు ప్రధాన కారణం మీరు పొదుపు చేయకపోవడం. పదవీ విరమణ ఫండ్ నిర్మించుకోవడంలో ప్రధానమైంది.. తగినంత పొదుపు చేసుకోవడం. మీ నెలవారీ ఆదాయంలో కొంత మొత్తాన్ని పదవీ విరమణ నిధిలో పెట్టలేదు అంటే పదవి విరమణ ఫండ్‌కు అర్థమే ఉండదు.
ఇందుకోసం నెలనెలా కొంత మొత్తాన్ని పక్కనపెట్టాలి. అది కుదరకపోతే బయట తినడం, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్లు ఇవ్వడం, ఇతర సబ్స్క్రిప్షన్లకు కేటాయించే వాటిల్లో కోతలు విధించుకోవడం ఉత్తమం. వీటితో పాటు రెండో ఆదాయ మార్గం ద్వారా సంపాదించేందుకు ప్రయత్నించి.. దాన్ని పొదుపు చేయాలి.
మీరు డిజిటల్ మార్కెటింగ్, యానిమేషన్ వంటి రంగాల్లో ఉంటే ఫ్రీలాన్సింగ్గా పని చేసుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. మీ ఖాళీ సమయాన్ని ఇందుకు వినియోగిస్తే అదనపు ఆదాయం వస్తుంది.
క్రెడిట్ కార్డులు ఎక్కువగా వినియోగించడం..
చిన్న చిన్న అవసరాలు.. ఉదాహరణకు గ్రాసరీ, రెస్టారెంట్లలో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరుపుతుంటే మీ ఆర్థిక స్థితి గురించి మరోసారి ఆలోచించడం మంచిది. చిన్న అవసరాలకు క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపు చేస్తే నెలాఖరుకు వాటి భారం భారీగా పెరిగిపోతుంది. దీనివల్ల మీకు తెలియకుండానే అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుంది.
మీరు సకాలంలో బిల్లులు చెల్లింపు చేయకుంటే దాని ప్రభావమూ క్రెడిట్ స్కోర్‌పైన పడుతుంది. అందుకే చిన్న చిన్న వాటికి డెబిట్ కార్డు ద్వారానే చెల్లింపులు చేయడం మంచిది.
నెలాఖరులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం..
నెలాఖరు రాగానే చేతిలో డబ్బులన్నీ అయిపోయి.. జీతం కోసం చూస్తున్నారు అంటే ఒక సారి మీ ఆర్థిక స్థితి గురించి సీరియస్‌గా ఆలోచించాల్సిందే. ఆ సమయంలో.. డబ్బులు అయిపోతున్నాయి అంటే, అది మంచి పరిణామం కాదనే విషయాన్ని గ్రహించాలి. ఇందుకోసం మీరు పూర్తిగా మీ జీతంపైనే ఆధారపడకుండా చూసుకోవాలని అర్థం చేసుకోవాలి.
ఇలా జరగకుండా.. నెల ప్రారంభంలోనే నెలాఖరుకు సరిపడా మొత్తాన్ని దాయాలి.
మీరు ఎంచుకున్న రంగంలో అవకాశాలు తక్కువ ఉండటం
మీరు పని చేస్తున్న రంగంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండవు.. అందులో పార్ట్ టైం ఉద్యోగాలంటే ఇంకా కష్టం అనుకుంటే.. అదనపు ఆదాయం కోసం కొత్త ప్రణాళికలు వేయాలి.
ఇందుకోసం ఇతర రంగాలపై అవగాహన పెంచుకోవాలి. ఆదాయం పెంచుకునేందుకు కొత్త కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవాలి.
అత్యవసర నిధి లేకపోవడం..
ప్రస్తుతం ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలేం. కరోనా సంక్షోభం ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఇలాంటి సమస్యలేవీ ముందుగా చెప్పిరావు. అందుకోసమే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవడం అవసరం.
అనారోగ్యం, ఆదాయం లేకపోవడం వంటి సమస్యలు పరిష్కారం చూపే విధంగా ఈ నిధి ఉపయోగపడాలి. మీ ఆదాయం తగ్గినా లేదా ఆగిపోయినా ఆరు నెలల వరకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా దీన్ని నిర్మించుకోవాలి. మీ నెలవారీ ఖర్చులు రూ.25 వేలు ఉంటాయనుకుంటే.. రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఈ నిధి ఉండాలి.
ద్రవ్యోల్బణాన్ని పరిగణించకపోవడం..
ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. ఒకప్పటితో పోలిస్తే ఇప్పడు వైద్య ఖర్చులు భారీగా పెరిగాయి. సగటు జీవన కాలం కూడా పెరిగింది. ఇప్పుడు కిలో బియ్యం రూ.30 ఉంటే.. భవిష్యత్‌లో రూ.100కి చేరొచ్చు. ఇదంతా ద్రవ్యోల్బణం ప్రభావమే. ఈ విషయాన్ని మీరు పరిగణించడం లేదంటే అది తప్పుడు ప్రణాళిక అని అర్థం.
ఇందుకోసం రోజురోజుకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆధారంగా భవిష్యత్ అవసరాలను అంచనా వేస్తూ మీ పదవి విరమణ నిధిలో ఎక్కువ డబ్బును పొదుపు చేయడం ఉత్తమం.
రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడకపోవడం..
పెట్టుబడులు పెడితే నష్టపోతామేమోనని రిస్క్ తీసుకునేందుకు భయపడితే.. కచ్చితంగా భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. రిస్క్ భయంతో పీపీఎఫ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం వంటి సురక్షితమైన సాధనాలపై మాత్రమే పెట్టుబడులు పెడుతున్నారు అంటే మీరు తప్పుచేస్తున్నట్లే.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే.. మీ పోర్ట్‌ఫోలియో ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు. ఒక దాంట్లో నష్టం వచ్చినా మరొకటి ఆ నష్టాన్ని భర్తీ చేసేలా నిర్మించుకోవాలి. ఇందుకోసం రిస్క్ లేని పెట్టుబడులతో పాటు ఈక్విటీ, ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ల వంటి వాటిపై దృష్టి సారించాలి.
ఇందులో చెప్పిన విషయాల్లో ఏవైనా మీరు పాటించకుండా వదిలేస్తున్నట్లు అనిపిస్తే వెంటనే వాటిని అలవాటు చేసుకోవడం ఉత్తమం. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ధనవంతుడిగా రిటైర్మెంట్ అవ్వడం అంటే భారీగా సంపాదించడం అని మాత్రమే కాదు. రిటైర్ అయ్యాక విశ్రాంత జీవితాన్ని ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడిపేందుకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోవడం అని అర్థం.
(రచయిత- విరాల్ భట్, పర్సనల్ ఫినాన్స్ నిపుణులు)
- గమనిక: ఈ కథనంలోని అంశాలు పూర్తిగా రచయిత దృష్టికోణంలో రాసినవి మాత్రమే. వీటితో ఈటీవీ భారత్‌కు, సంస్థ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు.
- పర్సనల్ ఫినాన్స్పై మీ సందేహాలను తీర్చుకునేందుకు businessdesk@etvbharat.com ను సంప్రదించవచ్చు.