ఆర్థిక వృద్ధిని సూచించే ఎనిమిది కీలక మౌలిక రంగాల ప్రగతి వరుసగా ఎనిమిదో నెలలోనూ పడకేసింది. ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ, స్టీల్ ఉత్పత్తి పడిపోవడం వల్ల అక్టోబర్లో ఈ రంగాల్లో 2.5 శాతం క్షీణత నమోదైంది. గతేడాది ఇదే నెలలో ఈ క్షీణత 5.5 శాతంగా ఉంది. అయితే బొగ్గు, ఫర్టిలైజర్, సిమెంట్, విద్యుత్ రంగాల వృద్ధి సానుకూలంగా నమోదైందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఈ ఎనిమిది రంగాల ఉత్పత్తి 13 శాతం పడిపోయింది. గతేడాది ఇదే సమయంలో ఈ రంగాలు 0.3 శాతం శాతం వృద్ధి చెందాయి.
ద్రవ్యలోటు...
మరోవైపు, ద్రవ్య లోటు మరింత పెరిగిపోయింది. వార్షిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ అంచనాలతో పోలిస్తే 119.7 శాతం అధికమైంది. కంట్రోలర్ ఆఫ్ జనరల్ అకౌంట్స్(సీజీఏ) గణాంకాల ప్రకారం అక్టోబర్ చివరి నాటికి వాస్తవ ద్రవ్యలోటు రూ.9,53,154 కోట్లకు చేరింది.
రెవెన్యూ వసూళ్లు పడిపోవడం వల్లే ద్రవ్యలోటు పెరిగినట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్ వల్ల వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. వసూళ్ల క్షీణతకు ఇదే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.
2020 సెప్టెంబర్ నాటికి వార్షిక బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ద్రవ్యలోటు 114.8 శాతం పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లోనే ఈ లోటు 102.4 శాతానికి చేరింది.