కరోనా సృష్టించిన సంక్షోభం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) దేశ వృద్ధి రేటు -7.7 శాతంగా నమోదవ్వచ్చని కేంద్ర గణాంక కార్యాలయం అంచనా వేసింది. అంతకు ముందు 2019-20లో దేశ వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదైంది.
2020-21కి సంబంధించి దేశ వృద్ధి రేటుపై కేంద్ర గణాంక కార్యాలయం వేసిన మొదటి అంచనా ఇదే.
వ్యవసాయం ఒక్కటే సానుకూలం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రంగం మాత్రమే 3.4 శాతం వృద్ధి రేటును నమోదు చేయొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. తయారీ రంగం క్షీణత 9.4 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.
సేవా, వాణిజ్యం, హోటళ్లు, రవాణా వంటి రంగాలు ఏకంగా 21.4 శాతం క్షీణతను నమోదు చేయొచ్చని లెక్క గట్టింది. 2019-20లో ఈ రంగాలు 3.6 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి.
ఆర్థిక సేవలు, ప్రజా సేవల విభాగాలు 2020-21లో వరుసగా 0.8 శాతం, 3.7 శాతం క్షీణించొచ్చని తెలిపింది.