దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఆర్థిక ఉద్దీపనలతో పాటు సంస్కరణలతో కూడిన ఉద్దీపనను కూడా ప్రయత్నించామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌పై చర్చించేందుకు దేశంలోని అగ్రశ్రేణి ఆర్థికవేత్తలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు మోదీ. బడ్జెట్ రూపకల్పనపై సలహాలు, సూచనలు స్వీకరించారు. కొవిడ్-19 వ్యాప్తి తరువాత ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక, సంస్కరణ చర్యలను నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా.. ప్రైవేటీకరణను వేగవంతం చేయటం, వాణిజ్యంలో అంతర్జాతీయ జోక్యాలు లేకుండా చూడటం, మౌలిక సదుపాయాల రంగంలో వ్యయాలు పెంచాలని ప్రధానిని కోరారు ఆర్థిక వేత్తలు.
వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు చేశారు ఆర్థిక నిపుణులు. కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత కారణంగా.. 2021-22 బడ్జెట్లో ద్రవ్య లోటుపై సున్నితంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం అనంతరం ప్రకటన జారీ చేసింది నీతి ఆయోగ్. గతంలో అంచనా వేసినదానికన్నా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, వేగంగా పుంజుకుంటున్నట్లు ఆర్థిక వేత్తలు అంగీకరించారని తెలిపింది. సుమారు 2 గంటల పాటు ఈ సమావేశం సాగింది.
"ఆర్థిక ఉద్దీపనతో పాటు, ప్రభుత్వం సంస్కరణ ఆధారిత ఉద్దీపనను కూడా ప్రయత్నించింది. ఇది వ్యవసాయం, వాణిజ్య బొగ్గు తవ్వకాలు, కార్మిక చట్టాల చారిత్రక సంస్కరణల్లో కనిపించింది. కొవిడ్-19 మహమ్మారి, దాని పర్యవసనాలు కొత్త సవాళ్లు విసిరాయి. జాతీయ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ కంపెనీలు గతంలో ఎన్నడూ చూడని విధంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలతో అనుసంధానం చేశాం. మన లక్ష్యాలను సాధించేందుకు ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ఏజెండా నిర్మాణంలో సంప్రదింపులు కీలక పాత్ర పోషిస్తాయి. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఎగుమతులను పెంచే విధానాలను రూపొందించాలని సమావేశానికి హాజరైన సభ్యులు సూచించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. బహుళ రంగాల్లో చేపట్టిన సంస్కరణలతో పాటు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించి.. భారీస్థాయిలో పెట్టుబడులు భారత్‌కు వచ్చేలా చూడాలని కోరినట్లు పేర్కొన్నాయి.
ఇదీ చూడండి: 'టీకా పంపిణీతో మానవాళికి ప్రయోజనం కలగాలి'