అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, కరోనా వంటి అనుకోని సంక్షోభాలు.. ప్రజలను పలకరించి వెళుతుంటాయి. వచ్చిన ప్రతీసారి ప్రాణ, ఆస్తి నష్టాలను కలిగిస్తూనే ఉంటాయి. ఇలాంటి సమయాల్లో కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణించినా లేదా అస్వస్థతకు గురైనా చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఆర్థిక విపత్తుల నుంచి కుటుంబాన్ని రక్షించుకునేందుకు.. "ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్" - అంటే వ్యాధి వచ్చాక బాధపడటం కన్నా.. రాకుండా నివారించడం మంచిదనే సూత్రం సరిగ్గా సరిపోతుంది.
సంక్షోభ సమయంలో కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పించేందుకు పాటించాల్సిన 5 ప్రధాన సూత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. జీవిత బీమా:
కుటుంబంలో సంపాదించే వ్యక్తి పేరుపై ఒక టర్మ్ పాలసీ తీసుకోండి. హామీ మొత్తం వార్షిక ఆదాయానికి 15 నుంచి 20 రెట్లు ఉండాలి. 60 సంవత్సరాలు వచ్చే వరకు పాలసీని కొనసాగించండి. పాలసీని కొనుగోలు చేసే సమయంలో అన్ని సరైన వివరాలను అందించండి. దీని వల్ల భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి. బీమా సంస్థ కోరితే, వైద్య నివేదికలను అందజేయండి. పాలసీ గురించి కుటుంబ సభ్యలకు తెలియజేయండి. 5 సంవత్సరాలకు ఒకసారి పాలసీని సమీక్షించి, అవసరమైతే అదనపు పాలసీని తీసుకోవాలి. క్లెయిమ్ మొత్తం కొంత భాగం ఏకమొత్తంగానూ, మిగిలినది 5 సంవత్సరాల పాటు నెలవారీగా తీసుకొనెలా ఏర్పాటు చేసుకోవడం మంచిది.
2. అత్యవసర నిధి:
అత్యవసర నిధి కోసం 6 నెలల పాటు నెలవారీ ఖర్చులకు సరిపోయే మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవాలి. ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోయినా లేదా ఉద్యోగం మారినా.. ఈ నిధి ఉపయోగపడుతుంది.
ఉదాహరణకు కరోనా కాలంలో చాలా మంది ఉద్యోగం కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందిపడ్డారు. అత్యవసర నిధి ఉంటే అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే వీలుంటుంది.
3.ఆరోగ్య బీమా:
మీరు 40 సంవత్సరాలకు పైబడిన వారైతే ఫ్యామిలీ ప్లోటర్ ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం మంచిది. దీని ద్వారా 3 నుంచి 4 సంవత్సరాల ముందుగా నిర్థారించిన వ్యాధులు కవరవుతాయి. వైద్య నివేదికలను ఇవ్వాలి. సంస్థ అందించే గ్రూప్ ఆరోగ్య బీమా పాలసీపై పూర్తిగా ఆధారపడకూడదు.
4.ఆర్థిక లక్ష్యాలు:
పిల్లల చదువులు, వివాహాలు, ఇంటి కొనుగోలు, పదవీ విరమణ నిధి వంటి స్వల్ప కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి.
5.లక్ష్యానికి తగినట్లుగా పెట్టుబడులు:
ప్రతీ లక్ష్యానికి చేరుకునేందుకు పట్టే సమయం, అందుకు అయ్యే ప్రస్తుత ఖర్చు, ద్రవ్యోల్భణం, రాబడి అంచనా, రక్షణ, లిక్వీడిటీ, వర్తించే పన్ను మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకుని మదుపు చేయండి. స్వల్ప కాలిక లక్ష్యాలకు రికరింగ్ డిపాజిట్, ఫిక్సెడ్ డిపాజిట్లు, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్‌పీఎస్, ఈక్వీటీ మ్యూచువల్ ఫండ్లు అనుకూలంగా ఉంటాయి.
చివరిగా:
ప్రతీ కుటుంబం కూడా నెలవారీ ఖర్చులకు సంబంధించి బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. ఖర్చులు పోగా ఎంతో మొత్తం మిగిలుతుందో తెలుసుకోవాలి. ఈ మొత్తాన్ని ప్రతి లక్ష్యానికి వర్గీకరించి ప్రతి సంవత్సరం సమీక్షించాలి. ఇది మీ లక్ష్యాలను సాధ్యమైనంత త్వరగా చేరుకునేందుకు సహాయపడుతుంది. డబ్బుతో వచ్చే అవసరాలు, ఆదాయం కంటే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సంపాదన ప్రారంభమైన తొలిరోజుల్లోనే పెట్టుబడులు ప్రారంభించడం ద్వారా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని జీవించవచ్చు.
ఇదీ చూడండి:అప్పులే శరణ్యంగా సగం కుటుంబాల జీవనం!