ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రకటించిన ప్యాకేజీలో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలు, వాణిజ్య సంస్థలను ఆదుకోవడంపై ..తద్వారా ఉద్యోగాలు కాపాడటంపై దృష్టి సారించారు. జీడీపీలో మూడో వంతు భాగం; 11 కోట్ల మందికి పైగా మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లకు రూ.3 లక్షల కోట్ల హామీ లేని రుణాలు తాజా ఉద్దీపనలో అతిపెద్దది. పరిశ్రమలకు ద్రవ్యలభ్యత పెంచే చర్యలనూ చేపట్టారు. చిన్నవ్యాపారులకు రుణాలిచ్చే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకూ ప్రత్యేక ద్రవ్యలభ్యత పథకాలను ప్రవేశపెట్టారు. రూ.200 కోట్లలోపు టెండర్ల విషయంలో విదేశీ కంపెనీలకు ఇక అనుమతినవ్వబోరు. దీని వల్ల చిన్న కంపెనీలకు ప్రభుత్వ టెండర్లు పొందడానికి వీలవుతుంది. అన్నిటి కంటే ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్‌ఎమ్‌ఈ)లకున్న నిర్వచనాన్ని, పరిమాణాన్ని మార్చి మరిన్ని కంపెనీలు ఆ విభాగంలోకి వచ్చేలా చేశారు. తయారీ, సేవల రంగాల మధ్య ఉన్న గీతను చెరిపేశారు. ఆర్థిక ప్యాకేజీపై పరిశ్రమ సంఘాలు ఫిక్కీ, సీఐఐ, అసోచామ్ హర్షం వ్యక్తం చేశాయి.
చిన్న వ్యాపారాలకు..రూ.3 లక్షల కోట్లు
- ఎంఎస్‌ఎంఈలు సహా చిన్న వ్యాపారాల కోసం హామీ లేని రూ.3 లక్షల కోట్ల రుణాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు.
- వీటి వల్ల 45 లక్షల సంస్థలకు ప్రయోజనం దక్కనుంది. ఉద్యోగాలు తొలగించకుండా కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలవుతుంది.
- ఈ రుణాలను 4 ఏళ్ల గడువుకు ఇస్తారు. 12 నెలల పాటు అసలుపై మారటోరియం ఉంటుంది. వడ్డీ కట్టాల్సిందే.
- 100 శాతం ప్రభుత్వ హామీతో ఈ రుణాలు లభ్యమవుతాయి.
- అక్టోబరు 31, 2020 వరకు ఈ పథకం అమల్లోకి వస్తుంది.
- హామీ రుసుము ఉండదు. తాజాగా ఎటువంటి హామీ పెట్టనక్కర్లేదు.
- రూ.25 కోట్ల పెట్టుబడులు; రూ.100 కోట్ల వరకు టర్నోవరు ఉన్న చిన్న వ్యాపారులకు ఈ పథకం వర్తిస్తుంది.
ఒత్తిడిలో ఉన్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు..రూ.20,000 కోట్లు
- రుణ ఒత్తిళ్లలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లకు రూ.20,000 కోట్ల సబ్‌ఆర్డినేట్ రుణాలు ఇవ్వనున్నారు. అంటే బ్యాంకుల ద్వారా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ ప్రమోటర్లకు రుణాలు ఇస్తారు. ఈ రుణాలను ప్రమోటర్లు ఈక్విటీ రూపంలో కంపెనీలోకి చొప్పిస్తారు.
- దీని వల్ల 2 లక్షల వ్యాపారాలకు ప్రయోజనం దక్కనుంది.
- నికర నిరర్థక ఆస్తులుగా మారిన లేదా ఒత్తిడిలో ఉన్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు వీటిని మంజూరు చేయనున్నారు.
ద్రవ్యలభ్యత,ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు..రూ.50,000 కోట్లు
- ద్రవ్యలభ్యత సమస్యలను ఎదుర్కొంటున్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను ఏర్పాటు చేస్తారు.
- దీని వల్ల రూ.50,000 కోట్ల మేర వీటికి ద్రవ్యలభ్యత ప్రయోజనాలు సమకూరుతాయి.
- కంపెనీలు తమ పరిమాణాన్ని, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి.
- స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడానికి ఇది ఊతమిస్తుంది.
ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల నిర్వచనం మార్పు..
- ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల నిర్వచనాన్ని ప్రభుత్వం మార్చింది. తద్వారా ఎక్కువ కంపెనీలు ఈ పరిధిలోకి రావడానికి వీలవుతుంది.
- పెట్టుబడుల పరిమితిని పెంచారు. అదనంగా టర్నోవరు అర్హతను జత చేశారు.
- ప్రస్తుతం తయారీ, సేవా రంగాలను విడివిడిగా పరిగణిస్తున్నారు. కొత్త నిర్వచనంలో తయారీ, సేవా రంగాలకు ఒకే నిర్వచనం ఇచ్చారు. ఇందుకు అవసరమైన చట్ట సవరణలు చేస్తారు.
రూ.200 కోట్లలోపు టెండర్లు దేశీయ సంస్థలకే
- భారత ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు విదేశీ కంపెనీల నుంచి సహేతుకం కాని రీతిలో పోటీ ఉంటోంది.
- ఈ నేపథ్యంలో రూ.200 కోట్ల వరకు ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్ టెండర్లలో విదేశీ కంపెనీలను అనుమతించకుండా, జనరల్ ఫైనాన్షియల్ రూల్స్‌లో సవరణలు చేపట్టనున్నారు.
- ఆత్మనిర్భర్‌భారత్(స్వయం ఆధారిత భారత్) దిశగా ఇది ఒక అడుగు కానుంది. భారత్‌లో తయారీకి ఇది ఊతమివ్వ నుంది.
- ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడనుంది.
రూ.30,000 కోట్లు.. ప్రత్యేక ద్రవ్యలభ్యత పథకం
- ప్రస్తుతం రుణ మార్కెట్ల నుంచి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, గృహ ఆర్థిక కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థల(ఎన్‌బీఎఫ్‌సీ/హెచ్‌ఎఫ్‌సీ/ఎమ్‌ఎఫ్‌ఐలు)కు నిధులు సమీకరించడం క్లిష్టంగా మారింది. అందుకే రూ.30,000 కోట్లతో ప్రత్యేక ద్రవ్యలభ్యత పథకాన్ని ప్రకటించారు.
- ప్రాథమిక, సెకండరీ మార్కెట్లోని ఎన్‌బీఎఫ్‌సీ/హెచ్‌ఎఫ్‌సీ/ఎమ్‌ఎఫ్‌ఐల రుణ పత్రాల్లో ఈ పెట్టుబడులు పెడతారు.
- ద్రవ్యలభ్యతను పెంచడానికి ఈ చర్య ఉపయోగపడనుంది.
- సెక్యూరిటీలకు ప్రభుత్వమే 100 శాతం హామీనిస్తుంది.
రూ.45,000 కోట్లు.. పాక్షిక రుణహామీ పథకం 2.0
- తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు, ఎమ్‌ఎఫ్‌ఐలు చిన్న వ్యాపారులకు తాజాగా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పాక్షిక రుణహామీ పథకం(పీసీజీఎస్)ను విస్తరించి బాండ్లు/కమర్షియల్ పేపర్ల జారీ వంటి రుణాలకు విస్తరించనున్నారు.
- తొలి 20 శాతం నష్టాన్ని హామీదారు అంటే ప్రభుత్వమే భరిస్తుంది.
- ఈ పథకం వల్ల రూ.45,000 కోట్ల ద్రవ్యలభ్యత వస్తుంది.
ఇతర చర్యలు
- కొవిడ్-19 కారణంగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు మార్కెటింగ్, ద్రవ్యలభ్యత విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. అందువల్ల వాణిజ్య ప్రదర్శనలు, ట్రేడ్ ఫెయిర్స్ స్థానంలో ఇ-మార్కెట్ లింకేజ్‌ను ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు తీసుకు రానున్నారు.
- లావాదేవీ ఆధారిత రుణాలను పెంచడానికి ఫిన్‌టెక్‌ను ఉపయోగించనున్నారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ వెండర్ల బకాయిల సెటిల్‌మెంట్‌లను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది.
- 45 రోజుల్లోగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ఇవ్వాల్సిన రూ.1 లక్ష కోట్ల బకాయిలను ఇవి విడుదల చేస్తాయి.
టీడీఎస్ రేటులో 25శాతం తగ్గింపు వేతనం మినహా ఇతర ఆదాయాలపైనే
ప్రజల చేతిలో నగదు లభ్యత పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు కొంత ఊరట కలిగించింది. వేతనం మినహా వివిధ రకాల ఇతర ఆదాయాలపై చెల్లించే మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)తో పాటు, చెల్లింపులను స్వీకరించే వారు వసూలు చేసే మూలం వద్ద పన్ను చెల్లింపు (టీసీఎస్)లో 25శాతం తగ్గింపును ప్రకటించింది. దీని ద్వారా ప్రజలకు రూ.50,000 కోట్ల వరకు నగదు అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ తగ్గింపు వర్తించనుంది.
వీటికి వర్తింపు
మే 14, 2020 నుంచి మార్చి 31, 2021 వరకు వచ్చిన అన్ని రకాల కాంట్రాక్టులు, వృత్తి ఆదాయం, వడ్డీ, అద్దె, డివిడెండ్, కమీషన్, బ్రోకరేజీ తదితర వాటిపై విధించే మూలం వద్ద పన్ను కోతలో 25 శాతం మేరకు తగ్గుతుంది. ప్రస్తుతం 10 శాతం వసూలు చేస్తుండగా, బదులు 7.5శాతంగా మారనుంది. ఉదాహరణకు మీకు పైన పేర్కొన్న ఆదాయాల్లో ఏదో ఒకటి రూ.10,000 వస్తుందనుకుందాం. అప్పుడు అందులో నుంచి 10శాతం అంటే, రూ.1,000 టీడీఎస్ చేసి, మిగతాది చెల్లించేవారు. ఇప్పుడు ప్రకటించిన తగ్గింపు వల్ల రూ.1,000కి బదులుగా రూ.750 టీడీఎస్ చెల్లిస్తే సరిపోతుంది. అంటే, చేతికి రూ.9,250 అందుతాయి. ‘ఇది తాత్కాలిక ఉపశమనమే. తర్వాత శ్లాబులను బట్టి, ఎలాగూ పన్ను చెల్లించాలి. అయితే, టీడీఎస్ రేటును 50శాతం తగ్గిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో మరింత మేలు చేకూరేది. దీంతోపాటు జూన్ 15, సెప్టెంబరు 15 తేదీల్లో చెల్లించాల్సిన ముందస్తుపన్నుకు డిసెంబరు 15 వరకు గడువు ఇస్తే ఇంకా బాగుండేది’ అని ప్రత్యక్ష పన్నుల నిపుణులు భావిస్తున్నారు.
పన్ను రిటర్నులకు నవంబరు 30 వరకు గడువు
గత ఆర్థిక సంవత్సరానికి (2019-2020)గాను సేవా సంస్థలు, నాన్ కార్పొరేట్ వ్యాపార సంస్థలు, వృత్తి నిపుణులు, భాగస్వామ్య సంస్థలు తదితరాలకు రావాల్సిన పన్ను రిఫండుల చెల్లింపులన్నీ వెంటనే చేయబోతున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని రకాల పన్ను రిటర్నుల సమర్పణ తేదీని గతంలో ప్రకటించిన జులై 31, 2020 నుంచి నవంబరు 30, 2020 వరకు ప్రభుత్వం పొడిగించింది. వివాదం నుంచి విశ్వాసం పథకం డిసెంబరు 31 వరకు ఉంటుందని, ఈ సమయంలో ఎలాంటి రుసుములూ విధించరని ప్రకటించింది. ఆదాయ మదింపులకు సంబంధించిన పరిశీలనా తేదీలను సెప్టెంబరు 30 నుంచి డిసెంబరు 31, 2020కి పెంచింది. మార్చి 31, 2021 తేదీని సెప్టెంబరు 30, 2021కు మార్చింది.