ఆర్థిక పరంగా భారత యువతలో నెలకొన్న అభద్రతాభావంపై దేశ రాజకీయాలు రూపుదిద్దుకోనున్నట్టు ఆర్థికవేత్తల నిఘా విభాగం (ఈఐయూ) వెల్లడించింది. దేశంలో ఆర్థిక మందగమనం, నిరుద్యోగ సమస్య సర్వత్రా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈఐయూ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.
"భారీ మెజారిటీతో ప్రధాని మోదీ మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. సామాజిక, భద్రతా సమస్యలపై దృష్టిపెట్టినప్పటికీ.. యువతలో పెరుగుతున్న ఆర్థిక అభద్రతతో దేశ రాజకీయాల రూపురేఖలు మారనున్నాయి."
--- ఆర్థికవేత్తల నిఘా విభాగం
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా ఆధారంగా.. గత నెలలో నిరుద్యోగ రేటు 8.5 శాతానికి చేరిందని వెల్లడించింది ఈఐయూ. ఇది గత మూడేళ్లల్లోనే అధికమని స్పష్టం చేసింది. సెప్టెంబర్లో ఈ శాతం 7.2గా ఉందని పేర్కొంది.
వయసు పరంగా దేశ జనాభాలో మార్పు రావడం (డెమొగ్రాఫిక్ డివైడెన్డ్) వల్ల భారత్ ఆర్థికంగా లాభపడే అవకాశమున్నప్పటికీ.. శ్రమశక్తి పెరుగుతున్న రేటు కంటే ఉద్యోగ కల్పన రేటు చాలా తక్కువగా ఉందని తెలిపింది ఎకానమీ ఇంటెలిజెన్స్ యూనిట్.
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపనలు సరిపోవడం లేదని అభిప్రాయపడ్డ ఈఐయూ.. నిర్మాణాత్మక సంస్కరణల అవసరం ఎంతో ఉందని ఉద్ఘాటించింది.
"హిందుత్వ అజెండాలోని ఎన్నో సమస్యలను పరిష్కరించారు మోదీ. కానీ ఆర్థిక రంగంలో పురోగతి లేకపోవడం వల్ల ఓటర్లల్లో అసహనం పెరుగుతోంది. ఇది మోదీకున్న ప్రజాదరణకు పెద్ద సవాలే."
--- ఈఐయూ నివేదిక