కరోనా కారణంగా కొన్ని నెలలుగా జనజీవనం అస్తవ్యస్తమైంది. పండుగ సీజన్‌తో ఇప్పుడిప్పుడే కొత్త ఉత్సాహం, సరికొత్త ఆశలతో ప్రజలు మళ్లీ సాధారణ జీవనం దిశగా అడుగులు వేస్తున్నారు. దసరా ముగిసిన వెంటనే ప్రజలు దంతేరాస్, దీపావళికి సన్నాహాలు చేసుకుంటున్నారు. పండుగ సీజన్ అంటే ముందుగా గుర్తొచ్చేది షాపింగ్. అయితే దంతేరాస్ దీపావళి బంగారం కొనుగోలు చేయడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది.
ఇందుకు తగ్గట్లే ఇప్పటికే.. బంగారం, వెండి దుకాణ సముదాయాల వెంబడి సందడి మొదలైంది. దుకాణ యజమానులు కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కరోనా వల్ల చాలా మంది ఆదాయాలు తగ్గిపోయాయి. ఇది దుకాణాదారులకు కాస్త ఇబ్బందికరకమైన విషయమనే చెప్పాలి. దీనివల్ల బంగారానికి డిమాండ్ గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గొచ్చనే అంచనాలు వస్తున్నాయి.
ఈ పరిస్థితులపై బంగారం దుకాణాల యజమానుల స్పందన ఇలా ఉంది.
"పరిస్థితులు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తున్నాయి. క్లయింట్లు తిరిగొస్తున్నారు. వినియోగదారులు కొనుగోళ్లు జరుపుతున్నారు. అమ్మకాలు మళ్లీ పుంజుకుంటాయని మేము ఆశిస్తున్నాం."
-సతీశ్ అగర్వాల్ కుందన్ జువెలర్స్, హైదరాబాద్
"దీపావళినాటికి బంగారం అమ్మకాలు 50 శాతం నుంచి 75 శాతం మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నాం." - సుమిత్ సింగాల్, నగల దుకాణం యజమాని, దిల్లీ
ఎలాంటి గడ్డు పరిస్థితులు, కఠినమైన సమయమైనా.. పండుగ రోజు ప్రజలు వాటన్నింటినీ మరిచిపోతారు. ఈ ఆశలతోనే తమ దుకాణాలను అందంగా అలంకరించి వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు యజమానులు.
బంగరం ధర రికార్డు స్థాయికి చేరినందున.. వినియోగదారులు కూడా హెవీ జువెలరీ కొనుగోలు విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు.
"బంగారం ధరలు పెరుగుతున్నాయి.. కానీ మేము కొనుగోలు చేయాల్సిన అవసరముంది."
- వినియోగదారురాలు, దిల్లీ
అయితే దీపావళికి ముస్తాబయ్యేందుకు అనేక మార్గాలున్నాయని ఫ్యాషన్ స్టైలిస్టులు అంటున్నారు.
"యువత ట్రెండ్ మార్చింది. ఎప్పుడూ లేటెస్ట్ ట్రెండ్లను ఇష్టపడే వారు ఇప్పుడు పద్ధతి మార్చారు. వారి ఇంట్లో అమ్మమ్మలు, అమ్మలకు సంబంధించిన నగలను తీసి.. వాటికి కొత్త రూపునిచ్చి ధరిస్తున్నారు"
-జాస్మిన్ అరోరా, స్టైలిస్ట్, ముంబయి
డిస్కౌంట్లు..
ప్రస్తుత పరిస్థితుల్లో విక్రయాలు పెంచుకునేందుకు జువెలరీ దుకాణాలు ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఇదే సమయంలో వినియోగదారులు కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు చూస్తున్నారు.
"మేము ధరలు తగ్గించి డిస్కౌంట్లు ఇస్తున్నాం. సిబ్బందిని తగ్గించుకోవడం వల్ల మాకు ఖర్చులు తక్కువవుతున్నాయి. అందుకే నగలను తక్కువ ధరలకు ఇవ్వగలుగుతున్నాం."
- మహేశ్ జైన్, శ్రీ చింతామని జువెలరీస్, ముంబయి
ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే.. ఈ సీజన్ ఆర్థిక పరంగా, పండుగపై భారీ అంచనాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఇదీ చూడండి:సంక్షోభంలోనూ ఆర్థిక భరోసాకు ఐదు సూత్రాలు..