కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) 17 నుంచి 28 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. పెంచిన డీఏ, డీఆర్లు జులై 1 నుంచే అమలులోకి రానున్నాయి.
ఈ నిర్ణయంతో 48.34 లక్షల ఉద్యోగులకు, 65.26 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. పెంచిన డీఏ, డీఆర్ వల్ల కేంద్రంపై రూ.34,401 కోట్ల అదనపు భారం పడనుంది.
పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు సమయం దగ్గరపడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన భేటీలో డీఏ, డీఆర్ పెంపు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్. కరోనా నేపథ్యంలో దాదాపు ఏడాది తర్వాత కేబినెట్ ప్రత్యక్షంగా సమావేశమవడం గమనార్హం.
కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు..
ఆయుష్ మిషన్ కార్యకలాపాలు 2026 మార్చి 31 వరకు పొడగించాలని కేబినెట్ నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం వెల్లడించారు. ఆయుష్ మిషన్‌కు రూ.4,607 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఆరు ఆయుష్ కళాశాలల ఏర్పాటు సహా ఆయుష్ డిస్పెన్సరీలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు వెల్లడించారు.
త్వరలో పశువుల కోసం అంబులెన్స్‌లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఠాకూర్. పశుసంవర్ధక, పాడి పథకాలకు రూ.54,618 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు.
వస్త్రాల ఎగుమతిపై పన్ను తగ్గింపు కొనసాగించాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేశీయ వస్త్ర పరిశ్రమకు మరింత ఊతమిచ్చే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఠాకూర్ తెలిపారు.