చైనా సహా ఇతర దేశాలను గడగడలాడిస్తున్న కొవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావం భారత్‌పై అంతంత మాత్రమేనని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. దేశంలోని రెండు రంగాలపై మాత్రమే దీని ప్రభావం ఉంటుందన్నారు. అదే సమయంలో ప్రపంచ వాణిజ్యంపై మాత్రం దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందన్నారు.
దేశంలోని ఔషధ, ఎలక్ట్రానిక్ తయారీ రంగాలు చైనా ముడి సరకులపై ఆధారపడుతున్నాయని, అందువల్ల కరోనా ప్రభావం ఆయా రంగాలపై మాత్రమే ఉంటుందని శక్తికాంత్ దాస్ అన్నారు. ఔషధ తయారీకి సంబంధించి ముడిసరకు ముఖ్యంగా చైనా నుంచి వస్తోందన్నారు. అయితే ప్రస్తుతం మన తయారీదారుల వద్ద మూడు నాలుగు నెలలకు సరిపడా సరకు ఉందని చెప్పారు. ముడిసరకు వస్తున్న రాష్ట్రాల్లో కరోనా ప్రభావం లేదని తెలిపారు. ఫలితంగా ఫార్మాకు అందే ముడిసరకు విషయంలో ఇబ్బందులు ఉండబోవని ఆశాభావం వ్యక్తంచేశారు.
మిగిలిన రంగాల్లోనూ..
అలాగే మొబైల్ హ్యాండ్‌సెట్లు, టీవీ సెట్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ఇక్కడి తయారీదారులు ముడిసరకుల కోసం ఇతర ఆసియా దేశాలతో చర్చిస్తున్నారని తెలిపారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై..
అదే సమయంలో ప్రపంచ ఆర్థికంపై ఈ వైరస్ ప్రభావం ఉంటుందని శక్తికాంత దాస్ అన్నారు. 2003లో చైనాలో సంభవించిన సార్స్ మూలంగా ఆ దేశ ఆర్థిక వృద్ధి 1 శాతం మేర తగ్గిందని అన్నారు. అప్పటికి ప్రపంచ జీడీపీలో ఆ దేశం వాటా 4.2 శాతం కాగా.. ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. ప్రస్తుతం 16.3 శాతం వాటాతో ప్రపంచంలో చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థంగా ఉందని చెప్పారు.
సార్స్ నాటితో పోలిస్తే చైనా ఆర్థిక వ్యవస్థ మరింత పెరిగిందని, కాబట్టి ప్రపంచ వాణిజ్యంపైనా, ప్రపంచ జీడీపీపైనా దీని ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు. భారత్ సహా, ఇతర దేశాల విధాన నిర్ణయాలు తీసుకునే వారు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు.