దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితుల గురించి కేంద్రంపై విమర్శల దాడిని పెంచుతున్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతింటున్నా, ఆశలు సన్నగిల్లుతున్నా... మోదీ ప్రభుత్వం వాస్తవాన్ని అంగీకరించట్లేదని ఆరోపించారు.
ఓ మీడియా నివేదికను ఉదహరిస్తూ ట్వీట్ చేశారు ప్రియాంక. భారత ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని మోదీ పెంచుతారన్న ఆశలతో గత ఆరేళ్లుగా విదేశీ పెట్టుబడిదారులు 45 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని భారత మార్కెట్లలో పెట్టారని.. కానీ గత జూన్ నుంచి 4.5 బిలియన్ల షేర్లు విక్రయించారని పేర్కొన్నారు.
హ్యూస్టన్‌లో ప్రవాస భారతీయులు నిర్వహించనున్న హౌదీ-మోదీ కార్యక్రమాన్ని ఉద్దేశించి.. ప్రియాంక పరోక్షంగా ప్రధానిని విమర్శించారు.
''రోజూ 5 ట్రిలియన్, 5 ట్రిలియన్ అని ఆడంబరాలకు పోవడం, వార్తా పత్రికల్లో ముఖ్యాంశంగా పేర్కొనడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేం. విదేశాల్లో కార్యక్రమాలను ప్రోత్సహించినంత మాత్రాన పెట్టుబడిదారులను రప్పించలేరు .''
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
''పెట్టుబడిదారుల్లో నమ్మకం సడలింది. ఆర్థిక పునాదులకు పగుళ్లొచ్చాయి.'' అని హిందీలో ట్వీట్ చేసిన ఆమె.. 'భాజపా బ్యాడ్ ఫర్ బిజినెస్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.
''భాజపా ప్రభుత్వం.. వాస్తవాన్ని అంగీకరించేందుకు నిరాకరిస్తోంది. ఆర్థిక వ్యవస్థ సూపర్ పవర్‌గా అవతరించే సమయంలో ఈ మందగమనం స్పీడ్ బ్రేకర్ వేసింది. పరిస్థితుల్ని మెరుగుపర్చకుండా... ఎంత హడావుడి చేసినా నిరుపయోగమే.''
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
ఆర్థిక వ్యవస్థ మందగమనంపై గత కొద్ది రోజులుగా కేంద్రాన్ని విమర్శిస్తూ వస్తున్నారు ప్రియాంక గాంధీ. దీనిపై బదులివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'వృద్ధి మందగమనాన్ని ఆర్థిక మంత్రి అంగీకరించాలి'