ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై విమర్శలు గుప్పించారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి ఆకలితో సొంత ఊళ్లకు కాలినడకన వెళుతున్న లక్షల మంది వలస జీవులు, నిరుపేదలకు.. ఈ ప్యాకేజీతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనలతో నిరాశ చెందినట్టు పేర్కొన్నారు.
ఆర్థిక ప్యాకేజీ ప్రకటన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరులతో మాట్లాడారు చిదంబరం.
"చిన్న పరిశ్రమల రంగానికి రూ. 3.6 లక్షల కోట్ల రుణాలు ప్రకటించింది కేంద్రం. కానీ మిగతా రూ. 16.4 లక్షల కోట్లు ఏవి? చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) ప్యాకేజీ మినహా ఆర్థిక మంత్రి ప్రకటించిన దానితో నిరాశ చెందాం. సొంత అజ్ఞానం, భయాలతో కేంద్రం దోషిగా నిలబడింది. ప్రభుత్వం తప్పనిసరిగా ఎక్కువ రుణాలు తీసుకోవాలి, ఎక్కువగా ఖర్చు చేయాలి. రాష్ట్రాలు ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకునేలా అనుమతించాలి. కానీ ప్రభుత్వం అలా చేయడానికి సిద్ధంగా లేదు."
– పి. చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి.
ప్రభుత్వం మొదటగా చేయాల్సింది.. దారిద్య్రరేఖకు దిగువనున్న 13కోట్ల కుటుంబాలకు నగదు బదీలీ అని చిదంబరం అన్నారు. ఒక్కో కుటుంబానికి రూ. 5వేలు ఇస్తే ప్రభుత్వానికి కేవలం రూ. 65వేల కోట్లు అవుతుందని చెప్పారు. ఒక్కో రంగానికి సంబంధించిన సమస్యను పరిగణించి ఆర్థిక సాయం అందించాలన్నారు.
ఆర్థిక ప్యాకేజీ ఓ గుండు సున్నా..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై తీవ్ర విమర్శలు చేశారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దీని ద్వారా రాష్ట్రాలకు ఎలాంటి ఉపయోగం లేదని.. ప్యాకేజీ అనేదే అతిపెద్ద గుండు సున్నా అని విమర్శించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ప్యాకేజీని తీసుకొచ్చారని ఆరోపించారు. అసంఘటిత రంగం, ప్రజా వ్యయం, ఉద్యోగాల కల్పనకు ఒరిగేది ఏమీ లేదన్నారు. ప్రధాని ప్రకటించిన సమయంలో ప్యాకేజీలో రాష్ట్రాలకు అనుగుణంగా ఎఫ్ఆర్బీఎం పరిధి పెంచటం వంటివి ఉంటాయనుకున్నప్పటికీ.. ఆర్థిక మంత్రి ప్రసంగంలో అలాంటివేవీ లేవన్నారు దీదీ.